
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. బ్రెజిల్లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారత్, బ్రెజిల్‌లకు ఐక్యరాజ్యసమితిలో ముఖ్యంగా భద్రతా మండలిలో మరింత ప్రాధాన్యం కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ ప్రతిపాదనకు చైనా, రష్యాలు తమ మద్దతుగా నిలిచాయి.
“భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యవంతమైన, సమర్థవంతమైనదిగా మారాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం” అని ఉమ్మడి ప్రకటనలో బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు సభ్యత్వంలో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ అభిప్రాయపడింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా ఏళ్లుగా వేచి చూస్తోంది. ఇప్పటికే భారత్‌కు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రకటనలో చైనా స్వయంగా శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు భారత్‌కు మద్దతు ఇవ్వడం విశేషం.
ఈసారి బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ అధ్యక్షతన జరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారిఫ్‌లు, రక్షణాత్మక చర్యలపై బ్రిక్స్ సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ ప్రాథమిక నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్న చర్యలు సరఫరా గొలుసులను ప్రభావితం చేసి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నాయి.
డబ్ల్యూటీఓ కేంద్రంగా ఉన్న పారదర్శకమైన, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను మేము బలోపేతం చేయాలనుకుంటున్నామని సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటనలో చెప్పాయి. అలాగే, యూఎన్ఎస్సీ ఆమోదించని ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు మానవహక్కులకు భంగం కలిగిస్తున్నాయని బ్రిక్స్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ఆంక్షలు పేద దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు.
ఈ రకమైన ఆంక్షలను పూర్తిగా తొలగించాలని, మానవ హక్కులు, అభివృద్ధి, ఆహార భద్రత, ఆరోగ్యానికి వీటివల్ల హాని కలుగుతోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మిలిటరీ ఖర్చులు, విభజన ధోరణిపై బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించడంలో ఎక్కడో లోపం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి అవసరాలపై నిధులు తగ్గుతున్నాయని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత బలోపేతానికి రాజకీయ-శాస్త్రీయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.
కాగా, ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విస్తరణతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం బ్రిక్స్ కు ఉందని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ), ప్రపంచ వాణిజ్య సంస్థ ( డబ్ల్యూటీఓ), బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను కూడా సంస్కరించాలని పిలుపినిచ్చారు.
ఏఐ కాలంలో ప్రతి వారం టెక్నాలజీ మారుతున్నదని చెప్పారు. 80 ఏళ్లుగా మారని గ్లోబల్ సంస్థలు అనుసంధానాన్ని కోల్పోతున్నాయని పరోక్షంగా భద్రతా మండలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంస్కరణలు అనివార్యమని, ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను పాత కాలపు టైప్‌రైటర్‌పై ఎప్పటికీ నడపలేరని తనదైన శైలిలో మోదీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ సదస్సులో ‘శాంతి, భద్రత, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు’ సెషన్లో మోదీ ఈ వాఖ్యలు చేశారు.
More Stories
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్
స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి
పైలెట్లను నిందించడం బాధ్యతా రాహిత్యం