
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 14.30 శాతందాకా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో తేలింది. 6 నెలల క్రితం ఇది 12.7 శాతంగానే ఉన్నది.
అయితే ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. వీటిలో ఎంతకీ వసూలుకాని క్రెడిట్ కార్డుల బకాయిలు కేవలం 2.1 శాతంగానే ఉండటం గమనార్హం. సర్కారీ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల్లో క్రెడిట్ కార్డుల ద్వారా పెరుగుతున్నవి ఎక్కువగా ఉండటంపట్ల ఆర్బీఐ ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంమీద, ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 1.8 శాతంగా ఉంటే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2.8 శాతంగా ఉన్నాయి.
నిజానికి మార్చిలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు దశాబ్దాల కనిష్ఠాన్ని తాకుతూ 2.3 శాతానికి దిగొచ్చాయి. నిరుడు సెప్టెంబర్లో వచ్చిన ఎఫ్ఎస్ఆర్లో ఇవి 2.6 శాతంగా ఉన్నాయి. అయితే 2027 మార్చి నాటికి మళ్లీ పెరగవచ్చన్న అనుమానాల్ని ఆర్బీఐ కనబర్చింది. ఇక మొత్తం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల ఎన్పీఏల్లో 46 బ్యాంకులకు చెందినవే 98 శాతం ఉన్నట్టు ఆర్బీఐ ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా, ఆర్థిక రంగంలో సైబర్ సెక్యూరిటీ స్థితిస్థాపకతను పెంపొందించడానికి, ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత రక్షణ వ్యూహాలను, రిస్క్ కట్టడి పర్యవేక్షణల్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈ విషయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆర్థిక సంస్థలకు సూచించింది.
కాగా, ఇప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానమేనంటూ తమ తాజా నివేదికలో ఆర్బీఐ పేర్కొన్నది. అయితే మే 30తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకింగ్ రుణాల వృద్ధి 4.9 శాతానికి పడిపోయిందని చెప్పింది. నిరుడు ఇదే సమయంలో 8.9 శాతంగా ఉన్నట్టు గుర్తుచేసింది.
“ధరల స్థిరత్వం వంటి ఆర్థిక సుస్థిరత అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి. ఆర్బీఐ, సెబీ తదితర ఆర్థిక రంగ రెగ్యులేటర్లు వినియోగదారుల రక్షణకు, పోటీని పెంచేందుకు కట్టుబడి ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక మార్పులు విధానపరమైన జోక్యాలకు సవాల్ విసురుతున్నాయి” అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు