రెండు వారాల్లో అపాచీ అటాక్‌ హెలికాఫ్టర్లు

రెండు వారాల్లో అపాచీ అటాక్‌ హెలికాఫ్టర్లు

 గత కొంతకాలంగా భారత్ ఎదురుచూస్తున్న అపాచీ అటాక్‌ హెలికాఫ్టర్లను వచ్చే రెండు వారాల్లో పంపిణీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా నుండి మూడు అపాచీ ఎహెచ్‌-64ఇ దాడి హెలికాఫ్టర్ల మొదటి బ్యాచ్‌ జుల్‌ 15నాటికి భారత్‌కు రానున్నాయని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. తదుపరి బ్యాచ్‌ అయిన మూడు హెలికాఫ్టర్లు నవంబర్‌ నాటికి డెలివరీ కానున్నాయని పేర్కొన్నారు.

2020లో అమెరికాతో కుదుర్చుకున్న 600 మిలియన్‌ డాలర్ల ఒప్పందం ప్రకారం భారత సైన్యానికి ఆరు ఎహెచ్‌-64ఇ అపాచీ అటాక్‌ హెలికాఫ్టర్ల డెలివరీ చేయనుంది. అయితే గతంలో రెండు సార్లు గడువులోపు అందించలేకపోయాయి. మొదట మే-జూన్‌ 2024కి షెడ్యూల్‌ చేయగా, అంతరాయాల కారణంగా డెలివరీ గడువును డిసెంబర్‌ 2024కి వాయిదా వేశారు.

మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, అమెరికా రక్షణ కార్యదర్శి ఫీట్‌ హెగ్సేత్‌తో ఫోన్‌లో సంభాషణ నిర్వహించిన తర్వాత ఈపరిణామం చోటుచేసుకుంది. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న, రాబోయే కార్యక్రమాలను ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అమెరికా అందించిన మద్దతుకు హెగ్సెట్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు ఉగ్రవాద దాడులను ముందస్తుగా నిరోధించే, తనను తాను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని ఆయనకు చెప్పారు.

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) తయారు చేస్తున్న తేజస్‌ లైట్‌ కంబాట్‌ -ఎంకె1ఎ విమానం కోసం అమెరికా తయారుచేసిన జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌లను సకాలంలో అందించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. భారత్‌లో జెట్‌ ఇంజన్ల కోసం ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటుపై కూడా ఆయన మాట్లాడారు. ఎల్‌సిఎ తేజస్‌ కోసం జిఇ జెట్‌ ఇంజన్ల డెలివరీకి సంబంధించిన నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించడానికి రక్షణశాఖ నిరాకరించింది.