సీబీఐ దర్యాప్తుకు వాల్మీకి కుంభకోణం

సీబీఐ దర్యాప్తుకు వాల్మీకి కుంభకోణం
కర్ణాటకతో పాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి  కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు, కీలక పత్రాలను సీబీఐకి ఇవ్వాల్సిందిగా సిట్‌ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. స్కామ్‌ గురించి సిట్‌ చేసిన దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, అరవింద్‌ లింబావలి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 
 
దీనిపై విచారించిన ధర్మాసనం కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేసింది. కేవలం సిట్‌ దర్యాప్తులోని లోపాల మీదనే కాకుండా స్కామ్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో విస్తృతమైన దర్యాప్తును చేయాల్సిందిగా ధర్మాసనం ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది. వాల్మీకి స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు తొలుత అప్పగించారు. 
 
అయితే, కేసులో ప్రధాన నిందితులుగా చెప్తున్న కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి బీ నాగేంద్రతో పాటు వాల్మీకి బోర్డు చైర్మన్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌కు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి విచారణ చేయకుండానే సిట్‌ అధికారులు వారిద్దరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఇదే సమయంలో వాల్మీకి స్కామ్‌లో బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిర్ధారించింది. ఈ మేరకు గతంలో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసి నాగేంద్రను అరెస్టు చేసింది.అనంతరం కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉన్నది.  ‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ.187 కోట్లు పక్కదారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ పీ చంద్రశేఖరన్‌ కిందటేడాది మేలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. 

ఈ స్కామ్‌ గురించి చంద్రశేఖరన్‌ తన ఆరు పేజీల సూసైడ్‌ నోటులో పేర్కొన్నారు. యూనియన్‌ బ్యాంకు సైతం తమ బ్యాంకులోని వాల్మీకి కార్పొరేషన్‌ ఖాతా నుంచి చట్టవిరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని ఫిర్యాదు చేసింది. సర్వత్రా ఒత్తిడి పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈడీ సైతం రంగంలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్‌’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. 

ఈడీ చార్జిషీట్‌ ప్రకారం వాల్మీకి స్కామ్‌ లింకులు హైదరాబాద్‌కు కూడా పాకినట్టు అర్థమవుతున్నది. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ సత్యనారాయణ వర్మతో కలిసి రూ.21 కోట్ల నిధులను నాగేంద్ర పక్కదారి పట్టించినట్టు ఈడీ ఆరోపించింది. బెంగళూరుతో పాటు బళ్లారి నుంచి ఈ డబ్బులను వివిధ ప్రాంతాలకు అక్రమంగా పంపించారని, లోక్‌సభ ఎన్నికల్లో వీటిని వినియోగించినట్టు ఈడీ గుర్తించింది.

వాల్మీకి స్కామ్‌లో ఈడీ ప్రధానంగా ప్రస్తావించిన సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌. ఈయన వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులను ‘ఫస్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ కో ఆపరేటీవ్‌ సొసైటీ’ ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కుంభకోణానికి సంబంధించిన నిధులతోనే సత్యనారాయణ వర్మ రూ.3.3 కోట్లతో లాంబోర్గిని కారును కూడా కొన్నట్టు ఈడీ గుర్తించింది.

ఈ కుంభకోణంలో సత్యనారాయణ వర్మతోపాటు ఇటకారి సత్యనారాయణ, చంద్రమోహన్‌, నాగేశ్వరరావులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నాయకులకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడనే ఆరోపణలున్నాయి. పక్కదారి పట్టించిన కార్పొరేషన్‌ నిధులను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించారని ఈడీ పేర్కొన్నది. సత్యనారాయణ వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ నిధులకు సంబంధించి కర్ణాటక మంత్రి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కూడా వచ్చి చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం.