ఇకపై ఎనిమిది గంటల ముందే రైల్వే చార్ట్‌

ఇకపై ఎనిమిది గంటల ముందే రైల్వే చార్ట్‌

రైళ్లు బయలుదేరడానికి ఎనిమిదిగంటల ముందే రిజర్వేషన్‌ చార్టులను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. అంటే మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే రైలు రిజర్వేషన్‌ చార్టులు ముందు రోజు రాత్రి 9గంటలకు సిద్ధం చేయబోతున్నది. రైల్వేల్లో ప్రయాణం టికెట్‌ రిజర్వేషన్‌ దశలోనే ప్రారంభమవుతుందని రైల్వే ప్రారంభం కానుండగా, టికెట్ బుకింగ్‌ను సులభతరం చేయడానికి రైల్వేలు అనేక చర్యలు చేపడుతుందని పేర్కొంది. 

ప్రస్తుతం రిజర్వేషన్ చార్ట్ రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు తయారవుతున్నది. దాంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంటున్నది. రైలు టికెట్‌ కన్ఫామ్‌ అవుతుందా? లేదా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల్లో అనిశ్చితిని తొలగించేందుకు రైలు బయలుదేరే ఎనిమిది గంటల ముందే రిజర్వేషన్‌ చార్ట్‌ను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. 

ఈ ప్రతిపాదనతో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏకీభవించారు. ఎలాంటి అంతరాయం కలుగకుండా దశలవారీగా దీన్ని అమలు చేయాలని బోర్డుకు సూచించారు. ఈ నిర్ణయంతో వెయిట్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులపై కొంత వరకు అనిశ్చితి తగ్గుతుంది. వెయిటింగ్‌ లిస్ట్‌ స్టేటస్‌ మరింత ముందుగానే తెలియడంతో దూర ప్రాంతాలు, శివారు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే భావిస్తున్నది.

వెయిట్‌లిస్ట్ నిర్ధారించబడకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు మరింత సమయం ఉండనున్నది. కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్ఎస్) ద్వారా ఇప్పుడు నిమిషానికి 1.5 లక్షలకు పైగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. దాంతో పాటు, జులై ఒకటి నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి మార్పులు ఉంటాయి. 

ఇకపై అథెంటికేషన్‌ యూజర్స్‌ మాత్రమే తత్కాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. దాంతో పాటు జులై చివరి నుంచి తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ కోసం వన్‌ టైమ్‌ పిన్‌ (ఓటిపి) ఆధారిత వెరిఫికేషన్‌ జరుగనున్నది. ఈ ఆన్‌లైన్‌ అథంటికేషన్‌ ప్రక్రియలో యూజర్లు డిజి లాకర్‌ అకౌంట్‌ సహాయం తీసుకోవచ్చు. డిజిలాకర్, ఏదైనా ఇతర ప్రభుత్వ ఐడీలో సేవ్ చేయబడిన ఆధార్ కార్డ్ డేటాను ధృవీకరణ కోసం ఉపయోగించవచ్చని రైల్వేశాఖ పేర్కొంది.