
నెల్లూరు జిల్లా ఉలవపాడులో ప్రతిపాదిత ఇండోసోల్ సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు కసరత్తు చేస్తుండటంతో రైతన్నలు పోరుబాటపట్టారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ పచ్చని పంట భూములనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన రైతులు ఆదివారం కలకత్తా- చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి భూసేకరణకు, సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
పోలీసుల ఆంక్షలను, బెదిరింపులను లెక్కచేయకుండా వేలాది మంది రైతులు ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు. రైతన్నల ఉద్యమానికి సిపిఎం, ఆప్, కాంగ్రెస్, విసివై, బిసివై పార్టీ నాయకులు మద్దతు పలికారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శనివారం నుంచే రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పదుల సంఖ్యలో రైతులను, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
అడుగడుగునా ఆంక్షలు విధించారు. జాతీయ రహదారిపై ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. కరేడు గ్రామం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో బలగాలను మోహరింపజేశారు. పోలీసుల ఆంక్షలను అధిగమించి అన్నదాతలు జాతీయ రహదారి చేరుకొని ఆందోళన చేపట్టారు. కరేడు, ఆ చుట్టుపక్క గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పచ్చని పంట పొలాలను ప్రయివేటు ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు ఇవ్వబోమని రహదారిపై రైతులు భీష్మించారు. రైతన్నల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను సాకుగా చెబుతూ వెంటనే రహదారిని ఖాళీ చేయాలని పోలీసులు రైతన్నలకు స్పష్టం చేశారు. రైతు సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
అయినా అన్నదాతలు తమ ఆందోళన కొనసాగించడంతో ప్రభుత్వ యంత్రాంగం దిగొచ్చింది. సబ్‌కలెక్టర్ శ్రీపూజ అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని రైతులను కోరారు. పచ్చని పంట పొలాలు, భూములను తాము ఇవ్వలేమని, ఆ భూములు కావాలంటే మా శవాలు మీద నుంచి వెళ్లాల్సివుంటుందని రైతులు తేల్చి చెప్పారు. ఇండో సోల్ సోలార్ ప్రాజెక్టుకు 8348 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్