
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిగత సహాయకుడుకు సిట్ తాజాగా నోటీసులు జారీచేసింది. కేసు దర్యాప్తులో భాగంగా, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఫోనులో కవిత పిఏకు సంబంధించిన కొన్ని కీలక ఆడియో రికార్డింగులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది.
ఈ ఆడియోల ఆధారంగా పూర్తి వివరాలు రాబట్టేందుకు మరియు కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిట్ బృందం కవిత పీఏను విచారణకు పిలిచింది. ఈ నోటీసుల జారీతో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరింత మంది నేతల ప్రమేయం బయటపడే అవకాశం ఉందనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ స్కామ్ లో మొత్తం 618 మంది ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారించింది.
ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతి పెద్ద ట్యాపింగ్ వ్యవహారంగా నిలిచింది. ఫోన్లు ట్యాప్ చేయబడిన బాధితుల్లో ఇప్పటికే 228 మంది వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, పలువురు వీఐపీల నుంచి కూడా ఈ కేసులో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
సిట్ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో, ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ప్రమేయం కలిగి ఉన్నారోనని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు