
రాజ్యాంగ పీఠికలో చేర్చిన ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను సమీక్షంచాలని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెల్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ పదాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన అసలు రాజ్యాంగంలోని లేవని, అవి ఎమర్జెన్సీ సమయంలో చేర్చారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు సామ్వవాదం అవసరం లేదని, లౌకిక వాదం మన సంస్కృతికి మూలం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని వారణాసిలో అత్యవసర పరిస్థితి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ సూచించారు. కాంగ్రెస్ డిఎన్ఎ లోనే నియంతృత్వం ఉందని ధ్వజమెత్తారు.
“అప్పుడు మన దేశానికి బాహ్య, అంతర్గత భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ప్రధానమంత్రి కుర్చీకి మాత్రమే ముప్పు ఉంది. అందుకే జూన్1975 జూన్ 25 రాత్రి మంత్రివర్గ సమావేశం లేకుండానే ఎమర్జెన్సీ ప్రకటించారు. తన అధికారాన్ని కాపాడుకోవడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు” అని ఆయన విమర్శించారు.
“ఆ సమయంలో నాకు 16 ఏళ్లు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ చీకటి రోజులను గుర్తుచేసుకుంటే నాకు గగుర్పాటు కలుగుతుంది. ఎమర్టెన్సీ సమయంలో తుర్క్‌మాన్ గేట్ వద్ద ఇళ్ల కూల్చివేత, బుల్డోజర్లతో ప్రజలపై దాడులు, ఎదురించిన వారిపై కాల్పులు జరిపారు. ఇది ప్రజలపై తుపాకీ కాల్పులు కాదు. ఇది రాజ్యాంగ హత్య” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఎలాంటి న్యాయ వ్యవస్థ హక్కులను తగ్గించడం, అన్ని పౌర హక్కులను సస్పెండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను మూసివేశారు. ఇది రాజ్యాంగ హత్య. దేశాన్ని ఒక పెద్ద జైలుగా మార్చారు. విపక్ష నాయకులు, విద్యార్థులనూ జైల్లలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని హతమార్చింది” అని చౌహాన్ దుయ్యబట్టారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పేరును ప్రస్తావించకుండా రాజ్యాంగ ప్రతిని పట్టుకునే హక్కు ఆయనకు లేదని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ ఎద్దేవా చేశారు.
“ఆ చీకటి రోజులు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. నియంతృత్వం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగేవారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది” అని డిమాండ్ చేశారు. “ప్రజాస్వామ్యాన్ని నేర్చుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నేర్చుకోవాలి. బీజేపీ ప్రజాస్వామ్య స్పూర్తిని గౌరవిస్తుంది. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే గొప్ప ప్రక్రియను మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ చేసిన తప్పులకు దేశానికి క్షమాపణ చెప్పాలి” అని చౌహాన్ డిమాండ్ చేశారు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో రాహుల్ గాంధీ మీడియా ముందు కేబినెట్ నిర్ణయాన్ని ఎలా చింపివేసారో ఆయన గుర్తు చేశారు. ఇది కేవలం అగౌరవం మాత్రమే కాదు, రాజ్యాంగంపై దాడి అని చౌహాన్ తెలిపారు. లక్ష మందికి పైగా జైలు శిక్ష అనుభవించిన అత్యవసర పరిస్థితిని కూడా ఆయన ప్రజలకు గుర్తు చేస్తూ చౌహాన్ రాహుల్ గాంధీని నకిలీ, నమ్మదగని నాయకుడు అని పిలిచారు.
More Stories
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు