ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాల ఈసీ సమీక్ష

ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాల ఈసీ సమీక్ష

విపక్షాల విమర్శల నేపథ్యంలో బిహార్‌తో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సిద్ధం అవుతోంది. ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో వెంటనే ఓటరు జాబితాల సమీక్షను మొదలుపెట్టనుంది. చివరిసారిగా 2003లో బిహార్‌లో ఓటరు జాబితాలను సమీక్షించారు. అంటే 22 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత అక్కడ ఈ ప్రక్షాళన ప్రక్రియ మళ్లీ జరగబోతోంది.

ఇక 2026 మే-జూన్‌లో పోల్స్ జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోంలలో ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఈసీ అధికార వర్గాలు తెలిపాయి. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కుతో ముడిపడిన ఓటరు జాబితాల సమగ్రతను పరిరక్షించేందుకే వాటిని తాము సమీక్షిస్తున్నట్లు వెల్లడించాయి.  ఇందులో భాగంగా ఓటరు జాబితాల్లో పేర్లున్న వారి సమాచారాన్ని వేరిఫై చేసేందుకు ఆయా రాష్ట్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని ఈసీ అధికారులు తెలిపారు.

ఓటరు జాబితాల సమీక్షలో భాగంగా వాటి నుంచి విదేశీ అక్రమ వలసదారుల పేర్లను తొలగించనున్నారు. ఓ రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రంలో ఓటుకు దరఖాస్తు చేసుకుంటే వారి నుంచి అదనంగా ఒక డిక్లరేషన్ ఫామ్‌ను తీసుకుంటున్నారు. ఈ ఫామ్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. 1987 జులై 1 కంటే ముందే భారత్‌లో జన్మించిన వారి కోసం ఒక ఆప్షన్, 1987 జులై 1 నుంచి 2004 డిసెంబరు 2 మధ్య భారత్‌లో జన్మించిన వారి కోసం మరో ఆప్షన్ ఉంటాయి.

దరఖాస్తుదారులు వారికి వర్తించే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. 1987 జులై 1 కంటే ముందే భారత్‌లో జన్మించిన వారు తప్పకుండా పుట్టిన తేదీ లేదా పుట్టిన ప్రదేశానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను సమర్పించాలి. 1987 జులై 1 నుంచి 2004 డిసెంబరు 2 మధ్య జన్మించిన వారు అదనంగా తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ లేదా పుట్టిన ప్రదేశం డాక్యుమెంట్లనూ ఇవ్వాల్సి ఉంటుంది.

ఓటరు జాబితాలను సమీక్షించే క్రమంలో రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని ఈసీ వెల్లడించింది. అర్హులైన ఓటర్ల కొనసాగింపు, అనర్హులైన వారి పేర్ల తొలగింపు అన్నీ చట్టప్రకారమే జరుగుతాయని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16లో దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తుచేసింది. ప్రధానంగా 5 కారణాల వల్ల తాము ఓటరు జాబితాలను సమీక్షిస్తున్నామని ఈసీ అధికార వర్గాలు తెలిపాయి. 

వేగవంతమైన పట్టణీకరణ, పెరిగిపోయిన వలసలు, కొత్త ఓటర్లు పెరుగుతుండటం, ఓటర్ల మరణాల సమాచారం అప్‌డేట్ కాకపోవడం, విదేశీ అక్రమ వలసదారులకూ ఓట్లు ఉండటం వంటి అంశాల వల్లే ఓటరు జాబితాల సమీక్షను చేపట్టామని పేర్కొన్నాయి. తప్పులకు తావు లేని ఓటరు జాబితాలకు రూపకల్పన చేసి, వాటి సమగ్రతను కాపాడుతామని ఈసీ స్పష్టం చేసింది.