లడ్డు ప్రసాదంలో నెయ్యి కాదు.. పామాయిల్… సీబీఐ

లడ్డు ప్రసాదంలో నెయ్యి కాదు.. పామాయిల్… సీబీఐ
తిరుమల తిరుపతి ఆలయాలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని సిబిఐ హైకోర్టుకు నివేదించింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకే కాకుండా రాష్ట్రంలో ప్రముఖమైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరపతమ్మ ఆలయాల్లో ప్రసాద తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తమ దర్యాప్తులో తేలిందని సిబిఐ అడ్వకేట్‌ పిఎస్‌పి సురేష్‌ కుమార్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. 
 
వాస్తవం చెప్పాలంటే కల్తీ నెయ్యి అనడం కంటే ఆవు నెయ్యి పేరుతో పామాయిల్‌లో కెమికల్స్‌ కలిపి ఆవు నెయ్యిలా కనబడేలా, సువాసన వచ్చేలా చేసి ప్రసాదాలకు సరఫరా చేశారని చెప్పారు. నెయ్యి అనేది లేదని, సరఫరా చేసింది ఏ నెయ్యీ కాదని స్పష్టం చేశారు. . వైష్ణవి డెయిరీ సిఇఒ అపూర్వ చావడా వేసిన బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్‌ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకటించారు. 
 
బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పామిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్లపై విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. సిబిఐ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని సిట్‌ దర్యాప్తు పూర్తి చేసినందున తమకు బెయిల్‌ ఇవ్వాలని పిటిషనర్ల వాదన. పలు డెయిరీల నుంచి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పామిల్‌ జైన్‌ (ఎ-3), విపిన్‌ జైన్‌ (ఎ-4) రూ.240 కోట్లు లబ్ధి పొందారని, ఈ ఇద్దరితోపాటు వైష్ణవి డెయిరీ సిఇఒ అపూర్వ వినరు కాంత్‌ చావడా (ఎస్‌) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కొట్టేయండని సిబిఐ వాదించింది.
 
“కల్తీ నెయ్యి సరఫరా వెనుక పామిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లది అత్యంత కీలక పాత్ర. ఈ ఇద్దరూ వైష్ణవి డైయిరీలో డైరెక్టర్లు. 2018లో బోలేబాబా డెయిరీని టిటిడి బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. దీంతో ఎఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీలతో బోలోబాబా డెయిరీ నెయ్యి సరఫరా కోసం టెండర్లు వేయించింది. టిటిడికి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ రెండు డెయిరీలకు లేవు. అయితే బోలేబాబా డెయిరీ ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో కాంట్రాక్టు పొందాయి” అని సిబిఐ తెలిపింది. 
 
“టెండర్లు పొందేందుకు చెల్లించాల్సిన టెండర్‌ అమౌంట్‌ బోలేబాబా డెయిరీ ఖాతా నుంచి ఎఆర్‌ డెయిరీ ఖాతాకు జమయ్యాయి. టిటిడితో ఎఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీలు టెండర్‌ పొందినప్పటికీ బోలేబాబా డెయిరీ నుంచే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. ఎఆర్‌, వైష్ణవి డెయిరీలకు ప్రతీ లీటరుపై రూ.3 కమిషన్‌ చెల్లింపులు జరిగాయి. నెయ్యి టెండర్లను వశం చేసుకునేందుకు టిటిడి ఆఫీసర్ల చేతులు తడిపింది” అని వెల్లడించింది. 
 
“నాణ్యత లేదని చెప్పి ఎఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టిటిడి వెనక్కి పంపించింది. అయితే, ట్యాంకర్లకు ఉన్న సీళ్లను తీసేసి ఆ ట్యాంకర్లలోని కల్తీ నెయ్యినే వైష్ణవి డెయిరీ ద్వారా టిటిడికి పంపింది. కేసులోని సాక్షిగా ఉన్న సంజరు జైన్‌ గత ఏప్రిల్‌ 7న వాంగ్మూలం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి తిరుపతి వస్తే, కల్తీ నెయ్యి సరఫరా చేసిన వాళ్లు బెదిరించారు” అని సిబిఐ ఆరోపించింది. 
 
“నిందితుడు అశిష్‌ రోహిల్లా మెజిస్ట్రేట్‌ ముందు నేరాగీంకారానికి సిద్ధం కాగా, రోహిల్లాకు తెలియకుండానే ఆయన పేరిట హైకోర్టులో వేరేవాళ్లు పిటిషన్లు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా రోహిల్లా హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు” అని సిబిఐ న్యాయవాది తెలిపారు.