కాల్పుల విరమణతో ముగిసిన ఇజ్రాయిల్, ఇరాన్ పోరు

కాల్పుల విరమణతో ముగిసిన ఇజ్రాయిల్, ఇరాన్ పోరు
12 రోజుల భీకర యుద్దానికి విరామం ప్రకటిస్తూ కాల్పుల విరమణ అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన్నట్లు తొలుత ఇరాన్, ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రకటించాయి.  ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్‌పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇరాన్‌ ప్రకటనతో ఇజ్రాయెల్‌తో 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.
 
ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ తెలిపారు. ఒక‌వేళ ఎటువంటి అతిక్ర‌మ‌ణ జ‌రిగినా అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతామ‌ని హెచ్చరించారు.  మంగళవారం తెల్లవారుజాము నుంచి యుద్ధవిరమణకు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించగా ఇరాన్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక ఛానల్‌ ప్రకటించింది. 
 
మరోవైపు ఇజ్రాయెల్ సైతం ట్రంప్​ కాల్పుల విరమణ ప్రకటనను ఆమోదించింది. ఈ మేరకు ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి బెంజిమన్ నెతాన్యాహూ ప్రకటించారు. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం ఏడున్నర గంటలకు యుద్ధ విరమణ అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఛానల్​  వెల్లడించింది. గ్రాఫిక్స్‌తో కథనం ప్రసారం చేసింది. యుద్ధ విరమణపై ఇరాన్‌ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్‌ కూడా ధ్రువీకరించింది. 
 
ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని సామాజిక మాధ్యమం ట్రూత్‌ ద్వారా ప్రకటించారు. దయచేసి దాన్ని ఎవరూ ఉల్లంఘించవద్దని సూచించారు.  క్యాబినెట్‌, ర‌క్ష‌ణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్‌, మొసాద్ అధినేత‌తో పాటు కీల‌క నేత‌ల్ని ప్ర‌ధాని నెత‌న్య‌హూ చ‌ర్చించార‌ని, ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ ల‌క్ష్యాల‌ను అందుకున్న‌ట్లు పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
 
న్యూక్లియ‌ర్, బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి పొంచి ఉన్న ప్ర‌మాదం పోయింద‌ని ఇజ్రాయిల్ చెప్పింది. ఇరాన్ గ‌గ‌న‌తలాన్ని పూర్తిగా ఐడీఎఫ్ ఆధీనంలో తీసుకున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఇరాన్‌లో కీల‌క టార్గెట్ల‌పై అటాక్ చేశామ‌ని, ఆ దేశ సైనిక నేత‌ల‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత ఇరాన్‌ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనలు గందరగోళానికి గురిచేశాయి. తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేనే తామూ ఆపేస్తామని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపటికే టెల్‌అవీవ్‌పై టెహ్రాన్‌ సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా మరో పోస్ట్​లో పేర్కొన్నారు. కాల్పుల విరమణకు సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు.