శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం

శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం
ఉగ్రవాదంపై భారత్‌ కఠినమైన విధానాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి స్పష్టం చేసిందని పేర్కొంటూ  దేశీయంగా తయారైన ఆయుధాలతో 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ను మన సైన్యం మోకాళ్లపై కూర్చోబెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారతీయుల రక్తాన్ని పారించిన ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడా సురక్షితం కాదని నిరూపించాం’ అని ప్రధాని వెల్లడించారు.
 
ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన భారత తయారీ ఆయుధాల గురించి ప్రస్తావిస్తూ భారత్​-పాక్ ఘర్షణల సమయంలో ఇండియన్ మేడ్ ఆయుధాలు తమ ప్రభావాన్ని చూపించాయని పేర్కొన్నారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల గురించి చెబుతూ, ‘భారతీయుల రక్తాన్ని చిందించిన ఉగ్రవాదులు ఎక్కడా దాక్కున్నా, అవి వారికి ఏమాత్రం సురక్షితం కాదని మేము నిరూపించాం’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఎలాంటి వివక్షతలు లేని బలమైన భారతదేశాన్ని కోరుకున్న గౌరవీయులైన వ్యక్తుల ఆదర్శాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 

గత 11 ఏళ్లుగా తమ ప్రభుత్వం భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక, రక్షణ రంగాల్లో బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. భారతదేశం తన రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడం క్రమంగా తగ్గుతోందని చెబుతూ భారత్​ స్వయంగా తన దేశీయంగా ఆయుధాలు తయారు చేస్తూ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్​గా మారుతోందని ఆయన స్పష్టం చేశారు.

:పహల్గామ్​లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన తరువాత, భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు వాడిన భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లోనే శత్రువులు​ మోకరిల్లేరా చేసింది” అని మోదీ తెలిపారు. 

అంతేకాదు భవిష్యత్​లో ప్రపంచవ్యాప్తంగా మేడిన్​ ఇండియా ఆయుధాలు వాడే రోజు వస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. సమాజంలో అణగారిన, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం తమ ప్రభుత్వం గృహనిర్మాణం, తాగు నీరు, ఆరోగ్య బీమా మొదలైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని మోదీ చెప్పారు. గతంలో కంటే, తాము అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఎక్కువ సంఖ్యలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్​ను ప్రారంభించామని ప్రధాని వివరించారు.

 
.