ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రతరం

ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రతరం
* రెండేండ్లలో 100 వార్‌హెడ్ల సమకూర్చుకున్న చైనా
* మొత్తం అణ్వాయుధాల్లో అమెరికా, రష్యా వాటా 90%
* భారత్ వద్ద 172 అణ్వస్త్రాలు
 
మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతున్నది. ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. చైనా గత రెండేండ్లలోనే ఏకంగా 100 అణు వార్‌ హెడ్‌లను తన అమ్ములపొదిలోకి చేర్చుకున్నట్టు స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) తన తాజా నివేదికలో వెల్లడించింది.
 
ప్రస్తుతం చైనా వద్ద కనీసం 600 వార్‌హెడ్‌లు ఉన్నట్టు తెలిపింది. ఆయుధ నియంత్రణ విధానాలు బలహీనపడుతున్న ప్రస్తుత సమయంలో ప్రమాదకరమైన కొత్త అణ్వాయుధ పోటీ ఉద్భవిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.  అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్‌, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్‌ వంటి 9 అణ్వాయుధ దేశాల్లో దాదాపు అన్నీ 2024లో తీవ్రమైన అణ్వాయుధ ఆధునికీకరణ కార్యక్రమాలను కొనసాగించాయని, ఇప్పటికే ఉన్న ఆయుధాలను అప్‌గ్రేడ్‌ చేసి కొత్త వెర్షన్లను జోడించాయని సిప్రి నివేదిక పేర్కొన్నది.
 
 2035 నాటికి చైనా 1500 అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది.  భారత్‌ గతేడాది తన అణ్వస్త్రాలను స్వల్పంగా పెంచుకోవడంతోపాటు వినూత్న అణు సరఫరా వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం దాని వద్ద 172 అణ్వస్త్రాలు ఉన్నాయని, ఈ ఏడాది వాటి సంఖ్య 180కి చేరుకుంటుందని సిప్రీ అంచనా వేసింది.  భారత్‌ సరికొత్తగా కంటైనర్‌లలో ఉండే తర్వాతి తరం క్షిపణులను అభివృద్ధి చేస్తోందని, వాటిలో సదరు క్షిపణులకు ముందే అణు వార్‌హెడ్లను మరింత సురక్షితంగా అమర్చే సౌకర్యం ఉంటుందని పేర్కొంది.
 
“తర్వాతి తరం నూతన డెలివరీ ప్లాట్‌ఫాంలలో అగ్ని ప్రైమ్‌ (అగ్ని-పీ) క్షిపణి, మల్టీ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికిల్‌ (ఎంఐఆర్‌వీ) సామర్థ్యం కల అగ్ని-5 క్షిపణి వ్యవస్థ ఉన్నాయి. అగ్ని సిరీస్‌ క్షిపణుల్లో అగ్ని-5 అత్యంత అధునాతనమైనది. దీని టార్గెట్‌ రేంజ్‌ వెయ్యి కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లకు ఉంటుంది” అని తెలిపింది.
 
మరోవైపు, పాకిస్థాన్‌ కూడా ఈ ఏడాది తన అణు వార్‌హెడ్ల సంఖ్యను 170కి పెంచుకోవాలని నిర్ణయించిందని ‘సిప్రీ’ వెల్లడించింది.”అణుసంబంధ మిలిటరీ మౌలిక వసతులపై దాడులకు మూడో వ్యక్తులిచ్చే తప్పుడు సమాచార వ్యాప్తి కూడా తోడైతే సంప్రదాయ యుద్ధం అణుసంక్షోభంగా మారుతుంది” అని సిప్రీ సీనియర్‌ పరిశోధకుడు మ్యాట్‌ కోర్దా హెచ్చరించారు. చైనా అతివేగంగా అణు వార్‌హెడ్లను తయారుచేస్తోందని సిప్రీ తెలిపింది. 
 
అమెరికా, రష్యాలతో పోటీపడుతూ ఏడాదికి వంద చొప్పున సిద్ధం చేస్తోందని,  ఈ ఏడాది మరో వంద తయారీలో నిమగ్నమెందని తెలిపింది. గత జనవరికల్లా 350 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (ఐసీబీఎం) నిల్వచేసే భూగర్భ కేంద్రాలను పూర్తిచేసిందని పేర్కొంది. అమెరికా, రష్యా వద్ద ఉన్న అణు వార్‌హెడ్లలో మూడో వంతు మాత్రమే చైనా వద్ద ఉండటంతో 2035కల్లా 1,500 వార్‌హెడ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. 
 
గత జనవరికల్లా ప్రపంచ దేశాల వద్ద 12,241 వార్‌హెడ్లున్నాయని తెలిపింది. అయితే సిప్రీ నివేదికపై స్పందించేందుకు నిరాకరించిన చైనా ఏటా వంద వార్‌హెడ్లు తయారుచేస్తున్నా, కని ష్ఠంగానే తన ఉత్పత్తి ఉందని పేర్కొది. అమెరికా, రష్యాలతో అణు రేసులో లేమని స్పష్టం చేసింది. తమ అణ్వస్త్ర కార్యక్రమం పూర్తిగా ఆత్మరక్షణకేనని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్‌ స్పష్టం చేశారు.