
ప్రస్తుతం ఓ రహస్య బంకర్లో దాక్కున్న ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ తన వారసులుగా ముగ్గురు సీనియర్ మతపెద్దల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఖమేనీ కుమారుడు ముజ్తబా పేరు లేదని ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వల్ల తనకు ఏదైనా హాని జరిగితే, వెంటనే తాను సూచించిన ముగ్గురిలో ఒకరిని సుప్రీం లీడర్‌గా చేయాలని ఇరాన్ మతపెద్దలతో కూడిన ప్రత్యేక కమిటీకి ఖమేనీ సూచించినట్లు తెలిసింది.
ఈ మేరకు వివరాలతో అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. సాధారణంగానైతే ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ముగ్గురి పేర్లను ఖమేనీ సిద్ధం చేయడంతో, అందులో జాప్యం జరిగే అవకాశం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన మిలిటరీ కమాండర్ల స్థానంలో కొత్త వారి భర్తీ ప్రక్రియను కూడా ఖమేనీ వెంటనే మొదలుపెట్టారని ఆ కథనంలో పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో వివిధ ఆర్మీ విభాగాల అధిపతులకు ఏదైనా జరిగితే, వారి స్థానాల్లో ఎవరెవరు సారథ్య బాధ్యతలను చేపట్టాలనేది ఇప్పుడే ఇరాన్ సుప్రీం లీడర్ నిర్ణయించి పెట్టారట. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒకవేళ చనిపోతే దాన్ని వీరమరణంగా, అమరత్వంగా భావిస్తానని ఖమేనీ చెప్పినట్లుగా అందులో ప్రస్తావించారు. తన ప్రాణానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని వారసుడి ఎంపిక ప్రక్రియను ఖమేనీ వేగవంతం చేశారని కథనం పేర్కొంది.
అత్యవసర ప్రణాళికల రూపకల్పనలో ఖమేనీకి చేదోడుగా ఉండే ముగ్గురు ఇరాన్ ఉన్నతాధికారుల నుంచి తమకు కీలక సమాచారం అందిందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. సదరు ఇరాన్ ఉన్నతాధికారుల ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఆర్మీ, రెవల్యూషనరీ గార్డ్ కమాండర్లతో మాట్లాడేందుకు ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలేవీ వినియోగించడం లేదు. ప్రస్తుతం తన సందేశాలను కమాండర్లకు చేరవేసేందుకు నమ్మకస్తులైన వారిని వాడుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఖమేనీ ఎక్కడున్నారు అనేది గుర్తించడం ఇజ్రాయెల్, అమెరికాలకు పెద్దసవాలే. ప్రస్తుతం ఖమేనీ ఒక రహస్య బంకర్లో ఉన్నారు. ఆయనకు ప్రత్యేక సైనిక కమాండ్ పహారా కాస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యే వారికి దేశంలోని సైన్యం, న్యాయ వ్యవస్థ, అసెంబ్లీలు, పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలపై నియంత్రణ ఉంటుంది. గత మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యవహరిస్తున్నారు.
More Stories
రష్యా ఆర్మీలోకి బలవంతంగా భారతీయ యువత
ఆసియా కప్ బాయ్‌కాట్ అంటూ బెట్టు చేసి తోకముడిచిన పాక్
అరబ్-ఇస్లామిక్ నాటో… ఇస్లామిక్ దేశాల సైనిక కూటమి