జస్టిస్‌ వర్మ స్టోర్‌ రూమ్‌లో నగదు కట్టలు నిజమే

జస్టిస్‌ వర్మ స్టోర్‌ రూమ్‌లో నగదు కట్టలు నిజమే

ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తమేనని, ఆయనను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. జస్టిస్‌ వర్మ నివసిస్తున్న తుగ్లక్‌ క్రీసెంట్‌లోని అధికారిక గృహంలో మార్చి 14 రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక, పోలీసులకు ప్రమాదం జరిగిన స్టోర్‌ రూమ్‌లో పెద్దయెత్తున నోట్ల కట్టలు కన్పించాయి. అందులో

పంజాబ్‌ – హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ షీల్‌ నాగు, జస్టిస్‌ జిఎస్‌ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌లతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ 55 మంది సాక్షులను విచారించింది. జస్టిస్‌ వర్మ స్టేట్‌మెంటును కూడా నమోదు చేసింది. అనంతరం 64 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. మే3న ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను బుధవారం పబ్లిక్‌ డొమైన్‌లో షేర్‌ చేసినట్లు తెలిపింది. 
అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వారు చూసిన వస్తువులను కచ్చితంగా రికార్డ్‌ చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, లేదా స్వాధీన మెమోను సిద్ధం చేయడంలో పోలీసులు, అగ్నిమాపక అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించారని పేర్కొంది.  స్టోర్‌రూమ్‌లో లభించిన నోట్లు, అనుమానాస్పద వస్తువుల విలువ చాలా ఎక్కువగా ఉంటుందని, జస్టిస్‌ వర్మ, కుటుంబసభ్యుల అనుమతి లేకుండా స్టోర్‌రూమ్‌కు చేర్చడం సాధ్యం కాదని నివేదిక తెలిపింది.

తనపై కుట్ర జరిగిందన్న జస్టిస్‌ వర్మ వాదనను కమిటీ తోసిపుచ్చింది. సిట్టింగ్‌ జడ్జి నివాస ప్రాంగణంలో అక్రమంగా నగదును ఉంచడం అసాధ్యమని పేర్కొంది. వాస్తవంగా కుట్ర అయితే ఢిల్లీ నుండి బదిలీని ఎందుకు అంగీకరించారని నిలదీసింది. జస్టిస్‌ వర్మ నివాస గృహంలో పెద్దయెత్తున నోట్ల కట్టలు ఉన్నట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారని, దీనికి దృశ్య ఆధారాలు కూడా ఉన్నాయని కమిటీ తెలిపింది.

కానీ జస్టిస్‌ వర్మ ఎప్పుడూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, న్యాయశాఖ అధికారులకు తెలియజేయడం కానీ చేయలేదని విచారణ కమిటీ పేర్కొంది. ఈ విషయంలో జస్టిస్‌ వర్మ ప్రవర్తన అసహజంగా ఉందని పేర్కొంటూ ఆయనను విధుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. కాగా, జస్టిస్‌ వర్మను అభిశంసించే విషయంపై ఏకాభిప్రాయ సాధన కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఇప్పటికే వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సిట్టింగ్‌ జడ్జిని బలవంతంగా పదవి నుండి తొలగించడం ఇదే మొదటిసారి అవుతుంది.