
* మొదటగా 110 మంది విద్యార్థులు భారత రాక
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోన్న వేళ ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడానికి కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 110 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులను తొలిదశలో భాగంగా కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది.
బుధవారం ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి విద్యార్థులంతా ప్రత్యేక విమానంలో బయలుదేరగా గురువారం తెల్లవారుజామున వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు తిరిగివచ్చిన వారిలో 90 మంది జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. స్వదేశానికి తిరిగి రావడంపై విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమను సురక్షితంగా స్వదేశంకు తీసుకు రావడం పట్ల భారత అధికారులు చూపిన శ్రద్ద పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ “భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా బాగున్నాయి. వారు మాతో సమన్వయం చేసుకున్నారు. అంతటా సంప్రదింపులు జరుపుతున్నారు” అంటూ తెలిపారు.
“ఆపరేషన్ సింధు ప్రారంభమైంది. ఇరాన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. జూన్ 17న ఇరాన్, అర్మేనియాలోని మన మిషన్ల పర్యవేక్షణలో అర్మేనియాలోకి ప్రవేశించిన ఉత్తర ఇరాన్ నుండి 110 మంది విద్యార్థులను భారతదేశం తరలించింది. వారు ప్రత్యేక విమానంలో యెరెవాన్ నుండి బయలుదేరి, 2025 జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకుంటారు. విదేశాలలో ఉన్న తన పౌరుల భద్రత మరియు భద్రతకు భారతదేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది” అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అంతకు ముందు ట్వీట్ చేశారు.
ఢిల్లీలో దిగిన తర్వాత అమన్ అజార్ అనే విద్యార్థి ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ “నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబాన్ని కలిసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు కూడా మనలాగే ఉన్నారు, చిన్న పిల్లలు బాధపడుతున్నారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ఇది మానవత్వాన్ని నాశనం చేస్తుంది” అని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, భారత విదేశాంగ శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేశంలో ఉన్న మిగిలిన భారతీయులను కూడా త్వరలోనే తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా, స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని కోరింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని కోరిన సంగతి తెలిసిందే.
More Stories
రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
వారసత్వ రాజకీయాల్లో అగ్రగామి ఏపీ