అల్లూరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి

అల్లూరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి
 
* కేంద్ర కమిటీలో మిగిలింది 16 మంది మాత్రమే

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు వద్ద గ్రేహౌండ్స్‌ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌; ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు అరుణ, ఏవోబీ స్పెషల్‌ జోన్ కమిటీ ఏసీఎం అంజులుగా వీరిని గుర్తించారు. వీరిలో ఇటీవల ఎన్​కౌంటర్​లో మరణించిన చలపతిరావు భార్య అరుణ ఉన్నారు.

2018లో దుంబ్రిగూడ సమీపంలో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. ఆమె స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం. ఉదయ్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.20 లక్షల రివార్డు ఉంది. వారి వద్ద నుంచి 3 ఏకే 47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మారేడుమిల్లి  అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో వీరు మృతి చెందారు.

ఇటీవల జనవరిలో ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మరణించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై రూ.కోటి రివార్డు ఉంది. ఇవాళ జరిగిన కాల్పుల్లో చలపతి భార్య అరుణ మృతి చెందారు.

కాగా మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.  2004లో నాటి పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినపుడు 42 మందితో కేంద్రకమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, సహజమరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కి తగ్గిపోయింది. 

ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం. కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. 10 రోజుల క్రితం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు.

రెండు దశాబ్దాల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ మధ్యభారతంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో జనతన సర్కార్‌ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్‌మడ్‌ వంటి కంచుకోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, క్యాడర్‌ను కాపాడుకుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌తో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యారు. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కీలక నాయకులు కూడా ఉంటున్నారు. 

ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్‌, ఓడిశా సరిహద్దుల్లోని కుల్హదీఘూట్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్రారెడ్డి అలియాస్‌ జయరాం, అలియాస్‌ చలపతి మరణించారు. ఆ తర్వాత మే నెలలో బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ సమీపంలోని లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మరణించారు. 

అదే నెలలో నారాయణపూర్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించటం ఇదే ప్రథమం. ఆ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతోపాటు 27 మంది మావోయిస్టులు మరణించారు.  తాజాగా గురువారం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు, ఏపీకి చెందిన తెంటు నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌ (64) చనిపోయారు. కేంద్ర కమిటీలో ప్రస్తుతం మిగిలిన16 మందిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా, జార్ఖండ్‌కు చెందినవారు ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఇద్దరున్నారు. 

ఏపీ, తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్‌ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు అలియాస్‌ ఊకే గణేష్‌, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజుదాదా, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, పసునూరి నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌, పోతుల కల్పన. జార్ఖండ్‌కు చెందిన వారు మిసిర్‌ బెస్రా అలియాస్‌ సునీల్‌, అనల్‌ దా అలియాస్‌ పాతిరాం మాంజీ, సహదేవ్‌ అలియాస్‌ అనూజ్‌. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు మాజ్జీదేవ్‌ అలియాస్‌ రాంధీర్‌, మాడ్వి హిడ్మా. వీరిలో పలువురు 60 ఏళ్లకు పైబడినవారే.