రేణిగుంట ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు

రేణిగుంట ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు

రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని కేంద్ర విమానయాన శాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్‍ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ తీర్మానాలను ఆయన మీడియాకు వివరిస్తూ రేణిగుంట విమానశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తెచ్చేలా చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

తిరుపతిలో సీఎస్ఆర్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  బెంగుళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమను కోరారని, ప్రస్తుతం అక్కడ వయ్యాలికావాలిలో ఉన్న టీటీడీ దేవాలయం చిన్నదిగా ఉండటంతో పెద్ద ఆలయం నిర్మించాలని ఆయన కోరినట్లు చెప్పారు. అక్కడ స్థలం కేటాయించగానే శ్రీవారి ఆలయం నిర్మించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు అందజేస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీటి వల్ల తిరుమల్లో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, తద్వారా శ్రీవారి మెట్టు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాదారుల నిలువు దోపిడీ నుంచి భక్తులకు విముక్తి లభిస్తుందని వెల్లడించారు.

తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సీఎస్ఆర్ ల్యాబ్ ద్వారా నెయ్యి, పప్పు ధాన్యాలు నాణ్యత పరిశీలన సులభతరమవుతుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సమరసత ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు.

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న యోగా డే సందర్బంగా టీటీడీ పరిపాలనా భవన మైదానంలో యోగా కార్యక్రమం చేపడుతున్నామని బీఆర్ నాయుడు తెలియజేశారు.

“తిరుపతిలో సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్ ఏర్పాటవుతుంది. ల్యాబ్ ద్వారా నెయ్యి, పప్పు ధాన్యాల నాణ్యత పరిశీలించవచ్చు. లీజు పద్ధతిలో ల్యాబ్‌కు స్థలం కేటాయించాలని నిర్ణయించాం. తిరుపతి విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని బిఆర్ నాయుడు వివరించారు.