ఇరాన్‌లో భయం గుప్పిట్లో భారత విద్యార్థులు

ఇరాన్‌లో భయం గుప్పిట్లో భారత విద్యార్థులు
ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో ఇరాన్‌ నిరంతరం అట్టుడుకుతోంది. దాంతో అక్కడున్న భారత విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను 148 కి.మీ. దూరంలోని కోమ్‌ నగరానికి తరలిస్తున్నారు.

“శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నేను నిద్రలోంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్‌మెంట్‌కు పరుగులు తీశాం. అప్పటి నుంచి మాకు నిద్రలేని రాత్రులే మిగిలాయి. ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది” అని భారత్‌కు చెందిన మెడిసిన్‌ విద్యార్థి ఇంతిసాల్‌ మొహిదీన్‌ చెప్పాడు.

22 ఏళ్ల ఇంతిసాల్‌ టెహ్రాన్‌లోని షాహిద్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఆ యూనివర్సిటీలో అతడితోపాటు దాదాపు 350 మంది భారత విద్యార్థులున్నారు.  ఇరాన్ లో 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉండగా, వారిలో ఎక్కువమంది జమ్మూకాశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు.  అదేవిధంగా ‘ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. రోజూ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తాగునీటిని కూడా భద్రపర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. వైద్యులుగా మారేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ ఇప్పుడు ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. మమ్మల్ని కాపాడండి ప్లీజ్‌’ అని మరో విద్యార్థి ఫైజాన్‌ నబీ ఆవేదన వెలిబుచ్చాడు.

ఇలా ఇరాన్‌లో ఉన్న భారత విద్యార్థులు ఎవరిని కదిలించినా తమ భయాల గురించే పంచుకుంటున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితిని అక్కడి భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. భారత విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కమ్యూనిటీ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది.

పరిస్థితి మరింత తీవ్రంగా మారితే విద్యార్థులను భారత్‌కు తరలిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది. భారత విద్యార్థుల తరలింపునకు టెహ్రాన్‌ అంగీకరించినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం ఇరాన్‌ గగనతలం మూసివేయబడినప్పటికీ, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా అన్ని భూ సరిహద్దులు తెరుచుకున్నాయని తెలిపింది. 

ప్రస్తుత ఉద్రక్త పరిస్థితులు, దేశంలోని విమానాశ్రయాల మూసివేయడంతో, అనేక దేశాలు తమ దౌత్యవేత్తలను, పౌరులను సురక్షితంగా పంపాలన్న అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని అన్ని భూభాగాల సరిహద్దులు తెరిచి ఉన్నాయని తెలియజేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈమేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి భారతదేశ దౌత్య కార్యాలయానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. 

దౌత్యవేత్తలు, పౌరులను సురక్షితంగా తరలించేందుకు సహాయం అందిస్తామని తెలిపారు. సరిహద్దులను దాటే వ్యక్తుల పేర్లు, పాస్‌పోర్ట్‌ నెంబర్లు,  వాహనాల వివరాలను జనరల్‌ ప్రోటోకాల్‌ విభాగానికి అందించాలని ఇరాన్‌ భారత్‌ను కోరింది. దౌత్యవేత్తలు, ఇతర పౌరుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రయాణ సమయం, ఆ వ్యక్తి ఏ సరిహద్దు నుండి వెళతారో తెలియజేయాలని కోరింది.