విమాన ప్రమాదంలో కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్ లభ్యం

విమాన ప్రమాదంలో కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్ లభ్యం
అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనలో విచారణకు అత్యంత కీలకమైన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌- సివిఆర్ లభ్యమైంది. ఘటనాస్థలిలో గాలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు దీనిని వెలికితీశారు. ప్రమాద కారణాలను గుర్తించడంలో ఇది కీలకమైన సాక్ష్యంగా భావిస్తున్నారు.  విమాన ప్ర‌మాదం ఎందుకు, ఎలా జ‌రిగింద‌న్న అంశాల‌ను క‌నుగొన‌డంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్ కీల‌కం కానున్న‌ది.
ఇందులో పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్‌మిషన్లు, వార్నింగ్ అలారంలు రికార్డై ఉంటాయి. విమానం స్పీడ్, ఎత్తు, ఇంజన్ పనితీరు వంటి సాంకేతిక వివరాలను అందించే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్‌తో పాటు డిజిటల్‌ వీడియో రికార్డర్‌లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.  బ్లాక్‌బాక్సులను సైతం స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. విమాన ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాకు అధికారులు తెలిపారు. 
అహ్మదాబాద్ విమానం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పీకే మిశ్రా పరిశీలించారు. సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. అక్కడే సర్క్యూట్​ హౌస్​లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు ప్రయత్నాలు గురించి చర్చించారు. కాగా, విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. 
అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మిగతా గుర్తింపు మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.