ఇరాన్‌లోని భారత పౌరులకు అడ్వయిజరీ

ఇరాన్‌లోని భారత పౌరులకు అడ్వయిజరీ
ఇజ్రాయెల్‌- ఇరాన్‌ దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ భయాందోళనకు గురికావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  అదేవిధంగా భారత పౌరులు రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని అడ్వయిజరీలో పేర్కొంది. 
 
“ఇరాన్‌లోని భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. రాయబార కార్యాలయం సోషల్ మీడియా అకౌంట్‌ను అనుసరించాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నిబంధనలు పాటించాలి’ అని భారత రాయబార కార్యాలయం” ఎక్స్‌ వేదికగా తెలిపింది.  ఇరాన్‌లోని భారతీయులతో భారత ఎంబసీ ఒక గూగుల్ ఫామ్‌ను షేర్ చేసింది. అందులో వ్యక్తిగత వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలని కోరింది. వారందరికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌ను కూడా భారత ఎంబసీ అందించింది. అందులో చేరితే, ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్‌ను పంపిస్తామని తెలిపింది. 
 
ఇరాన్‌లోని భారతీయులు +98 9128109115, +98 9128109109 నంబర్లకు కాల్ చేయొచ్చని, +98 901044557, +98 9015993320, +91 8086871709 నంబర్లకు వాట్సాప్ చేయొచ్చని తెహ్రాన్‌లోని భారత ఎంబసీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. బందర్ అబ్బాస్ ప్రాంతంలో +98 9177699036, జహేదాన్ ప్రాంతంలో +98 9396356649 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించింది.