బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ లేఖ 

బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ లేఖ 

ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ నెల 13న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాసిన తెలంగాణ మంత్రి, ఏపీ ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా నిలువరించాలని, టెండర్లు పిలవడం సహా ఏపీ ముందుకెళ్లకుండా చూడాలంటూ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపణలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని వివరించారు.  ఏపీ సీఎం నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే, జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసి అభ్యంతరాలు తెలిపామని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని, మొదట్నుంచీ చట్టపరంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. హరీశ్ రావు వాదనలు నిరాధారం, తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణకు కృష్ణానదిలో నీటి కేటాయింపులను కేవలం 299 టీఎంసీలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి, మాల్యాల నుంచి నీటిని పెద్దమొత్తంలో తరలించారని గుర్తుచేశారు. 

రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ఖరారైనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను సంప్రదించలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రోజూ 3 టీఎంసీల నీటిని మళ్లిస్తోంటే కేసీఆర్ చోద్యం చూశారని, జగన్‌తో అవగాహనతోనే కేసీఆర్ తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ చేసేలా అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

కాగా, ఏపీ సర్కార్‌ నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎలాంటి అనుమతుల్లేకుండా బనకచర్లను నిర్మించే ప్రయత్న చేస్తున్నారని ఆరోపించారు. నీటివాటాలపై ఇప్పటికే గోదావరి ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ, అది ఏర్పాటయ్యే లోపే ప్రాజెక్టు పూర్తి చేసి 200 టీఎంసీలను హక్కుగా పొందాలనే పథకం రచించిందని తెలిపారు.