ఇజ్రాయెల్‌ దాడుల్లో మరో ఇద్దరు ఇరాన్ కీలక నేతల హతం

ఇజ్రాయెల్‌ దాడుల్లో మరో ఇద్దరు ఇరాన్ కీలక నేతల హతం
* ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్‌
 ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య మొదలైన భీకర యుద్ధంలో ఇరాన్‌ మరో ఇద్దరు కీలక నేతలను కోల్పోయింది.  సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్‌ మీడియా తాజాగా వెల్లడించింది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 
 
మరోవైపు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఫోర్డో అణు కేంద్రానికి పరిమిత నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ ధృవీకరించింది. ‘ఫోర్డో అణు కేంద్రానికి పరిమిత నష్టం జరిగింది. కొన్ని పరికరాలను, సామగ్రిని వేరే ప్రాంతానికి తరలించాము’ అని రాష్ట్ర అణుశక్తి సంస్థ ప్రతినిధి జెహ్రూజ్‌ కమల్వాండి వెల్లడించారు. ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’  పేరుతో అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై  గతంలో ఎన్నడూలేని విధంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడింది.
టెహ్రాన్‌ చుట్టుపక్కల ఉన్న అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్‌ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నది.  78 మంది చనిపోయారని, వారిలో అత్యధికులు సాధారణ పౌరులే ఉన్నారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్‌ ప్రతినిధి వెల్లడించారు. మరో 320 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. అయితే తమ ఇరాన్‌కు చెందిన ఆరుగురు టాప్‌ మిలిటరీ కమాండర్లు, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతిచెందారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్‌ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్‌ మొహమ్మద్‌ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమం అధికారి జనరల్‌ అమీర్‌ అలీ హాజీజాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మృతి చెందారు.

కాగా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ను ఇరాన్‌ ప్రారంభించింది. టెల్‌ అవీవ్‌, జెరూసలేంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్‌ మిస్సైళ్లతో దాడులు చేసింది. దీంతో రెండు నగరాల్లో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, సుమారు 34 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లోని డజన్లకొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది.

ఇరాన్‌ అణు ముప్పును నిర్మూలించడం తమకు తప్పనిసరి అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఇరాన్‌ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకే ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ను ప్రారంభించామని తెలిపారు. ఇందుకు తమకు ఒక ఏడాది లేదా కొన్ని నెలలు పట్టవచ్చు అని చెప్పారు.  ఇజ్రాయెల్‌ మనుగడకు ఇరాన్‌ అణు కార్యక్రమం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అందుకే ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని చెప్పారు.

తన యుద్ధం ఇరాన్‌ ప్రజలతో కాదని పేర్కొన్నారు. ‘గత 46 ఏండ్లుగా మిమ్ములను తొక్కి ఉంచుతున్న క్రూర నియంతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మీ విమోచన దినం దగ్గరలోనే ఉంది’ అని తెలిపారు.  ఏడాది కాలంగా ఇజ్రాయెల్‌ ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థపై దాడులు చేస్తున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో రష్యన్‌ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. అక్టోబర్‌లో క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసింది.

ఇలా ఉండగా, అమెరికాతో జరుగుతున్న అణు చర్చల నుంచి వైదొలగుతున్నామని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులు చేసిందని, దానికి కఠిన శిక్ష విధిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ తన క్రూరమైన, రక్తసిక్తమైన హస్తాన్ని ఇరాన్‌లో నేరాలకు పాల్పడేందుకు చాచిందని విమర్శించారు.