విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో ఈ నెల 21న ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ‘యోగా సంగమం’ పేరుతో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రజలు, 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు. ఆయన తన శాఖ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ప్రత్యేక అధికారి పీఎన్ రంజిత్‌కుమార్‌లతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర ప్రచారం మొదలుపెట్టిందని, 10 లక్షల మంది యోగాభ్యాసకుల సమూహాన్ని తయారుచేయడమే దీని ఉద్దేశమని తెలిపారు. విశాఖలో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కేంద్రమంత్రి తెలిపారు.
ఈ క్రమంలో ఉదయం 6.30 – 7.00 గంటల మధ్య జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని, 7 నుంచి 7.45 గంటల వరకు యోగాభ్యాసం సాగుతుందని వివరించారు. ఇందులో 19 – 20 యోగాసనాలు వేస్తారని వయస్సు, జెండర్‌తో సంబంధం లేకుండా ఎక్కువ మంది చేయగలిగే యోగ ప్రక్రియలకు ఇందులో చోటు కల్పించారని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా జరపాలని ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరేలా ప్లాన్ చేస్తోంది.
అదేవిధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా విశాఖలో యోగా డే నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మంది పాల్గొనేలా ఆర్‌కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింట్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని చూస్తున్నారు.
68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పించనున్నారు. ఆర్‌కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు అధికారులు గుర్తించారు.

More Stories
మహిళా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు
మద్యం కేసులోనూ జగన్ ముద్దాయి కాబోతున్నారు
మొంథా తుఫాన్ బాధిత రైతులకు పంటల భీమా ప్రశ్నార్ధకం!