బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతపై ప్రశ్నలు!

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతపై ప్రశ్నలు!

అహ్మదాబాద్‌లో లండన్‌లోని గాట్విక్‌కు వెళ్తున్న ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ-171 కుప్పకూలింది. ఇది బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం కావడంతో ఆ విమానాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఈ విమానాలు వివాదాల్లో కూరుకుపోయాయి. ఉత్పత్తి ప్రక్రియ.. నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గతంలో ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్పేసింగ్ సమస్యలపై పలువురు ఇంజినీర్లు ఆరోపణలు వ్యక్తం చేశారు. బోయింగ్ అక్రమాలకు పాల్పడుతోందంటూనే విమానాల తయారీలో షార్ట్‌కట్స్‌‌ వైఫల్యాలపై హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో 2020లో అనేక బోయింగ్‌ 787 విమానాలను ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్ స్కిన్ సర్ఫేసింగ్‌ సహా నాణ్యత నియంత్రణల సమస్యల కారణంగా గ్రౌండింగ్ చేశారు. 

బోయింగ్ ఇంజినీర్ సామ్ సలేహ్‌పూర్ 787, 777 రెండింటిలోనూ తయారీ షార్ట్‌కట్స్‌, తయారీ వైఫల్యాలపై హెచ్చరికలు చేశారు. ఆయా సమస్యలు విమానాల వయసు పెరిగే కొద్ది ప్రమాదాల బారినపడే అవకాశాలుంటాయని హెచ్చరించారు. విజిల్‌బ్లోయర్‌ వాదనలపై ఎఫ్‌ఏఏ సైతం దర్యాప్తు చేశారు. 787 నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఏరోస్పేస్ -గ్రేడ్ టైటానియం మిశ్రమం బదులుగా స్టాండర్డ్ టైటానియం తదితన పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఏ గుర్తించింది.

787 డ్రీమ్‌లైనర్ ఉత్పత్తిలో బోయింగ్ అనేక సమస్యలను ఎదుర్కొంది. ప్రధాన సమస్యల్లో ఒకటి దాని సరఫరా గొలుసు, ఉత్పత్తి ప్రక్రియలో జాప్యం. అలాగే, బోయింగ్ విమానం ఈ మోడల్‌లోని భాగాలకు నాణ్యత నియంత్రణ లేదని తేలింది. దాంతో భద్రతా సమస్యలను లేవనెత్తింది. భద్రతా సమస్యల కారణంగా, విమానం భద్రత, నాణ్యతను ప్రశ్నించిన నియంత్రణ సంస్థల నుంచి బోయింగ్ దర్యాప్తులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఈ వివాదాలు బోయింగ్‌కు ఆర్థిక నష్టాలను తీసుకువచ్చాయి. అదే సమయంలో కంపెనీ ప్రతిష్టను సైతం ప్రభావితం చేశాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ జెట్ చుట్టూ ఉన్న వివాదం విమానయాన పరిశ్రమలో నాణ్యత నియంత్రణ, ఉత్పత్తి ప్రక్రియల ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. బోయింగ్ ఈ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది. కానీ, వివాదం కంపెనీ ప్రతిష్ట, ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది.

అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బోయింగ్‌ విజిల్‌ బ్లోయర్‌ జాన్‌ బార్నెట్‌ను ఈ ప్రమాదం మరోమారు గుర్తుకు తెచ్చింది. విమానం ఉత్పత్తి ప్రమాణాలను ఆధారాలతో సహా ప్రశ్నించిన ఆయన బోయింగ్‌పై దావా కూడా వేశారు. బార్నెట్‌ బోయింగ్‌లో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశారు. నిరుడు మార్చి 9న సౌత్‌ కరోలినాలోని చార్లెస్టన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
 
62 ఏళ్ల బార్నెట్‌ మూడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని బోయింగ్‌కు అంకితం చేసిన బార్నెట్‌ నార్త్‌ చార్లెస్టన్‌ ఫెసిలిటీలో 2010 నుంచి క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో విమాన ఉత్పత్తిలో భద్రతపై పలుమార్లు ఆందోళన వ్యక్తంచేశారు. మరీ ముఖ్యంగా 787 డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో భద్రతను ప్రశ్నిస్తూ తయారీలో లోపాలను ఎత్తిచూపారు.
2019లో ఓ ఇంటర్వ్యూలో బార్నెట్‌ మాట్లాడుతూ బోయింగ్‌ విమానాల డెడ్‌లైన్‌ సమీపిస్తుండటంతో నాసిరకం పరికరాలను బిగించాలంటూ కార్మికులపై సంస్థ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించారు. అవన్నీ స్క్రాప్‌బిన్‌(చెత్తకుప్ప) నుంచి తెచ్చినవేనని పేర్కొన్నారు.
బోయింగ్‌ 787లో 25 శాతం ఎమర్జెన్సీ ఆక్సిజన్‌ సిస్టం ఫెయిలయ్యే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బార్నెట్‌ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) 2017లో బోయింగ్‌ ఫెసిలిటీలో రివ్యూ చేసింది. ఈ సందర్భంగా నాణ్యతకు అనుగుణంగా లేని 53 విడిభాగాల జాడ కనిపించడం లేదని పేర్కొంది. ఈ తప్పును సరిచేసుకోవాలని బోయింగ్‌ను ఆదేశించింది.

అయితే, బోయింగ్ విమాన కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైన‌ర్ ఇలా కూల‌డం ఇదే మొద‌టిసారి అని విమాన‌యాన నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా న‌డిపిస్తున్న ఆ విమాన మోడ‌ల్‌ను 2011లో ప్ర‌వేశ‌పెట్టారు. 14 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఆ విమానాన్ని డ్రీమ్‌లైన‌ర్ మోడ‌ల్‌గా కూడా పిలుస్తారు. అమెరికా కంపెనీ డ్రీమ్‌లైన‌ర్ విష‌యంలో ఇటీవ‌ల ఓ వేడుక కూడా నిర్వ‌హించింది. డ్రీమ్‌లైన‌ర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది ప్ర‌యాణికులు ట్రావెల్ చేశార‌ని మైలురాయి సంబ‌రాలు కూడా జరుపుకున్నారు.

787 మోడ‌ల్‌కు చెందిన విమానాలు ప్ర‌స్తుతం 1175 వినియోగంలో ఉన్నాయి. ఆ విమానాలు ఇప్ప‌టి వ‌ర‌కు 50 ల‌క్ష‌ల ఫ్ల‌యిట్ జ‌ర్నీలు చేశాయి. డ్రీమ్‌లైన‌ర్ మోడ‌ల్ విమానాలు ఇప్ప‌టి వ‌ర‌కు 3 కోట్ల ఫ్ల‌యిట్ అవ‌ర్స్ ట్రావెల్ చేసిన‌ట్లు ఇటీవ‌ల బోయింగ్ కంపెనీ వెల్ల‌డించింది.