
విశాఖ రైల్వే జోన్ పరిధి పైన స్పష్టత ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిని కుదింపు పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి పునర్విభజన పైన కీలక ప్రతిపాదనలు సమర్పించారు. డివిజన్ల విభజన, సరిహద్దుల్లో మార్పులు, ఆదాయంతో పాటు రైళ్ల నిర్వహణ వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రైల్వే బోర్డుకు నివేదించారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రక్రియలో భాగంగా దక్షిణ కోస్తా జోన్‌కు రైల్వేబోర్డు కొద్దిరోజుల క్రితం జనరల్ మేనేజర్ (జీఎం)ను నియమించింది. త్వరలో మరో 3 అధికారులనూ నామినేట్ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుత, కొత్తగా ఏర్పడే జోన్‌ల సరిహద్దులు ఎలా నిర్ణయించాలి, ఆదాయాన్ని ఎలా పంపిణీ చేయాలి అనే విషయాలను ఆ అధికారులు బృందం నిర్ణయించనుంది.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌ను) రైల్వే అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పార్లమెంట్ అస్యూరెన్స్ కమిటీకి సమర్పించగా, అందులో దక్షిణ మధ్య రైల్వే పంపిన నోట్‌లో రాయగడ డివిజన్ పరిధి, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు అనే వివరాలు మాత్రమే ఉన్నట్లుగా తెలిసింది.
భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లో రాయగడ డివిజన్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ డివిజన్ పరిధిలోకి ఏపీ ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు రానున్నాయి. కాగా, దక్షిణమధ్య రైల్వే జోన్‌లో ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లు ఉంటాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు దక్షిణ కోస్తా జోన్‌లోకి వెళతాయి. ఈ మూడింటితో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుచేస్తారు. దీంతో దక్షిణ కోస్తా జోన్‌లో 4 రైల్వే డివిజన్లు ఏర్పాటవుతాయి. ఈ మేరకు తుది నిర్ణయం తరువాత అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కానుంది.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా