
సాంకేతికత రెండు వైపులా పదును ఉన్న కత్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. టెక్నాలజీని న్యాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించకూడదని, విధులను మెరుగుపరచడానికి వాడాలని ఆయన సూచించారు. భారత్ వంటి విస్తారమైన, వైవిధ్యమైన, సంక్లిష్టమైన దేశంలో న్యాయం పొందే అవకాశాన్ని పెంచడంలో సాంకేతికత ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ‘న్యాయం పొందే అవకాశాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత పాత్ర’ అనే అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ న్యాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే తపనతో భారత్లోని న్యాయవ్యవస్థ సాంకేతికతను సులభంగా సమగ్రపరచిందని చెప్పారు.
“సాంకేతికత రెండు వైపులా పదును ఉన్న కత్తిలా పనిచేస్తుంది. ఇది అసమానమైన విభజనలకు కూడా దారితీస్తుందని మనం అంగీకరించాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, డివైజ్లు, డిజిటల్ అక్షరాస్యతకు ఇప్పటికే న్యాయం కోసం ఎదురుచూస్తున్న అణగారిన వర్గాలను మినహాయించడానికి దారితీస్తుంది. అయితే విధానపరమైన జోక్యాలు లేకుండా న్యాయ నిర్ణయాల్లో ఎటువంటి విప్లవం సాధించలేం. సాంకేతికత, మధ్యవర్తిత్వ నిర్ణయాలకు మానవ పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధరించే పాలనా చట్రాలను అభివృద్ధి చేయాలి” అని వివరించారు.
భారత్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, 121 కంటే ఎక్కువ మాతృభాషల్లో మాట్లాడుతున్నారని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. అలాంటి దేశంలో కోర్టులకు సమానమైన ప్రాప్యతను నిర్ధరించడం రాజ్యాంగం బాధ్యత, నైతిక ఆవశ్యకత అని అయన చెప్పారు. ఆర్టికల్ 32, 226లు పౌరులు తమ హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు, హైకోర్టులను నేరుగా ఆశ్రయించడానికి అధికారం ఇస్తాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ నియమాలు, పౌరుల ప్రత్యక్ష అనుభవాల మధ్య సాంకేతికత వారధిగా మారిందని చెప్పారు. “వీడియో కాన్ఫరెన్సింగ్ కోర్టులలో శాశ్వత స్థిరాంకంగా మారింది. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు ఖరీదైన, ఎక్కువ సమయం ప్రయాణం కోసం వృథా చేయకుండా సుప్రీంకోర్టు ముందు కేసులను వాదించడానికి వీలు కల్పించింది. న్యాయం పొందేందుకు ఉన్న అడ్డంకులు ఇప్పుడు టెక్నాలజీ సాయంతో తగ్గిపోతున్నాయి” అని తెలిపారు.
“వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ కోర్టుకు అందుబాటులో ఉంది. బిహార్, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది ఇప్పుడు దిల్లీ వచ్చేందుకు ఎక్కువ డబ్బులు, సమయం కేటాయించే అవసరం లేకుండా సుప్రీంకోర్టు ముందు హాజరు కావచ్చు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యులు ఎటువంటి భయంలేకుండా సాక్ష్యం చెప్పొచ్చు.” అని బీఆర్ గవాయ్ వివరించారు.
సువాస్ (సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్ వేర్) గురించి కూడా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రస్తావిస్తూ కృత్రిమ మేధస్సుతో నడిచే ఈ అనువాద సాధనం చట్టపరమైన పత్రాలను తొమ్మిది ప్రాంతీయ భాషల్లో మారుస్తుందని చెప్పారు. ఆంగ్లేతర భాష మాట్లాడేవారికి కీలకమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. న్యాయ పారదర్శకత, పనితీరు పర్యవేక్షణలో జాతీయ న్యాయ డేటా గ్రిడ్ (ఎన్ జె డి జి) గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని ప్రశంసించారు. డేటా ఆధారిత విధాన రూపకల్పనకు, విధానపరమైన అడ్డంకులను గుర్తించడానికి ఎన్ జేడీజీ వీలు కల్పిస్తుందని అబిప్రాయం వ్యక్తం చేశారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం