అఖిల పక్ష ఎంపీల ప్రతినిధి బృందంతో మోదీ

అఖిల పక్ష ఎంపీల ప్రతినిధి బృందంతో మోదీ
పాకిస్తాన్ ప్రమేయమున్న ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రపంచ రాజధానుల్లో పర్యటించి వచ్చిన అఖిలపక్ష ప్రతినిధుల బృందాల సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు సమావేశమయ్యారు. తమ పర్యటనల వివరాలను ఎంపీలతా ప్రధానితో పంచుకున్నారు. 
 
50 మందికి పైగా ప్రతినిధులతో ఏడు బృందాలు ప్రపంచ దేశాల్లో పాక్ వైఖరిని ఎండగడుతూ, ఉగ్రవాదంపై పోరులో భారత వాణిని బలంగా వినిపించడంపై కేంద్ర ఇప్పటికే అభినందనలు తెలియజేసింది. 33 దేశాల రాజధానులు, యూరోపియన్ యూనియన్‌లో పర్యటించిన ప్రతినిధుల బృందాల్లో మాజీ పార్లమెంటెరియన్లు, మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.
 
“వివిధ దేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వివిధ ప్రతినిధుల సభ్యులను కలిశాను. శాంతి పట్ల భారతదేశం యొక్క నిబద్ధత, ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరించాను. వారు భారతదేశం స్వరాన్ని ముందుకు తెచ్చిన తీరు పట్ల మనమందరం గర్విస్తున్నాము” అని ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన ప్రతినిధుల బృందం ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ను కలుసుకుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారత వైఖరిని బలంగా వినిపించిన సభ్యుల కృషి జైశంకర్ అభినందించారు. నాలుగు ప్రతినిధుల బృందాలకు ఎన్డీయే ఎంపీలు సారథ్యం వహించగా, వీరిలో బీజేపీకి చెందిన 2, జేడీయూ, శివసేనకు చెందిన చెరో ప్రతినిధి బృందం ఉంది. తక్కిన మూడు ప్రతినిధి బృందాలకు విపక్ష ఎంపీలు సారథ్యం వహిచారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీ (ఎస్పీ)లు ఒక్కో ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించాయి.
బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, బైజంయత్ పాండ, కాంగ్రెస్ నేత శశిథరూర్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేన నేత శ్రీకాంత్ షిండే, డీఎంకే నేత కనిమొళి, ఎన్‌సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సులే సారథ్యంలో ఈ ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటించాయి. ఉగ్రవాదంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. 

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు. మాజీ పార్లమెంటేరియన్లలో కేంద్ర మాజీ మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు సైతం ఉగ్రవాదంపై పోరులో భారతదేశ ఐక్యతా సందేశాన్ని చాటారు.