మరోసారి భారత్ పై ఉగ్రదాడి జరిగితే ఉగ్రవాదులు ఎక్కడున్నా లోపలకు చొచ్చుకుపోయి తిరిగి దాడి చేస్తామని, వారిని వదిలి పెట్టబోమని విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ పాకిస్థాన్ ను హెచ్చరించారు. బ్రస్సెల్స్‌లో పర్యటిస్తున్న ఆయన. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలు ఉంటే.. తాము పాక్‌లోకి వెళ్లి దాడి చేస్తామని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పాక్ నుంచి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ మళ్లీ సైనిక చర్య తీసుకునేందుకు వెనుకాడదని తేల్చిచెప్పారు. “ఉగ్రవాదం ఈ దేశం (పాక్) జాతీయ విధానంలో భాగం” అని మండిపడ్డారు. భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిందని, 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని చెబుతూ ఆ తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిందని గుర్తు చేశారు.
అయితే, దీనికి స్పందనగా పాకిస్తాన్ భారత్‌పై దాడికి చేసేందుకు ప్రయత్నించిందని, దానితో పాకిస్తాన్‌లోని పలు వైమానిక స్థావరాలపై భారత్ భారీ దాడులు చేసిందని, ఆ తర్వాత పాకిస్తాన్ దాడులు ఆపాలని విజ్ఞప్తి చేసిందని, దానికి భారత్ అంగీకరించిందని జైశంకర్ వివరించారు.
“ఉగ్రవాదులు పాకిస్థాన్లో ఉంటే అక్కడికే వెళ్లి దాడుల చేస్తాం. పాక్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడడంలో ఆరితేరిన దేశం. పాక్తో యుద్ధంలో జరిగిన విమానాల నష్టంపై సరైన సమయంలో తగిన అధికారులు వెల్లడిస్తారు. భారత వైమానిక దాడులు పాక్ సైనిక మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీశాయి. రఫెల్ ఎంత ప్రభావవంతంగా ఉందో తెలియాలంటే పాకిస్థాన్లో నాశనమైన వైమానిక స్థావరాలే రుజువు” అని తెలిపారు.
“మే 10వ తేదీ ఉదయం మేము ఈ ఎనిమిది పాకిస్తాన వైమానిక స్థావరాలపై దాడి చేశాం. నా మాట నమ్మకపోతే పాక్ వైమానిక స్థావరాల ధ్వంసమైన ఫొటోలు గూగుల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో మీరు ఆ రన్ వేలు, హ్యాంగర్లను చూడొచ్చు” అని సూచించారు. భారత్‌కు చెందిన నాలుగు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లుగా పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిని ప్రశ్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, కానీ, త్వరలోనే సంబంధిత అధికారులు సరైన సమయంలో పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తారని చెప్పారు. భారత్ చేసిన దాడిలో పాక్ చాలా నష్టపోయిందని, భారత యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలతో ఖచ్చితత్వంతో దాడి చేసిందని స్పష్టం చేశారు. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు గూగుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపాన్నారు.
పాక్ నిరంతరం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే శిక్షణ ఇస్తుందని జైశంకర్ ఆరోపించారు. వేలాది మంది ఉగ్రవాదులు దక్షిణ సరిహద్దుల్లో ఉన్నారని చెబుతూ ఇకపై తాము ఉగ్రవాదాన్ని సహించలేమని, భవిష్యత్‌లో మళ్లీ ఏప్రిల్ తరహా దాడులు కొనసాగితే ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా తమ సందేశం స్పష్టంగా ఉందని జైశంకర్ హెచ్చరించారు.
More Stories
`గాజా శాంతి ఒప్పందం’కు మోదీకి ట్రంప్ ఆహ్వానం?
25 పాక్ ఆర్మీ పోస్టుల స్వాధీనం.. 58 మంది సైనికుల హతం!
`ఆపరేషన్ బ్లూ స్టార్’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది