
అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని, 16 జిల్లాల్లోని 5.6 లక్షల మంది ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రం ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ మేరకు అధికారిక బులెటిన్ విడుదల చేసింది. వర్షాల కారణంగా గురువారం మరో ఇద్దరు మరణించారని తెలిపింది. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడ్డంతో మరణించిన వారి సంఖ్య 21కు చేరుకున్నట్లు తెలిపింది.
మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలో దాదాపు 70 శాతం ప్రాంతం ముంపునకు గురయిందని, దీంతో వన్యప్రాణులు కూడా ప్రభావితమయ్యాయని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. బ్రహ్మపుత్ర, కోపిలి నదుల వరదతో అభయారణ్యం తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. జంతువులను రక్షించడానికి అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) బులెటిన్ ప్రకారం 16 జిల్లాల్లోని 57 రెవెన్యూ సర్కిళ్లు, 1,406 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో 5,61,644 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ప్రస్తుతం 175 సహాయ శిబిరాల్లో 41 మందికి పైగా ప్రజలు ఆశయ్రం పొందుతున్నారని తెలిపింది. మరో 210 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపింది. శ్రీభూమి జిల్లాలో తరలింపు కార్యక్రమాలు చరుగ్గా జరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని కొన్ని ప్రాంతాలను వరదనీరు ముంచెత్తిందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి హిమంతా బిస్వా శర్మ బరాక్ వ్యాలీలో శుక్రవారం రెండో సారి పర్యటించి వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కాగా, సిక్కింలో వరదలలో చిక్కుకున్న 17 మంది పర్యాటకులను శుక్రవారం హెలికాప్టర్ లో సురక్షిత ప్రాంతంకు చేరవేశారు. వీరితో ఈ ప్రాంతంలో ముంపులో చిక్కుకున్న వారిని కాపాడిన సంఖ్యా 80కు చేరుకోగా, మరో 47 మంది ఇంకా వరదలలో చిక్కుకొని ఉన్నారు.
కాగా, చేతన్ సైనిక శిబిరం నుండి వారాలలో కొట్టుకుపోయి జూన్ 1 నుండి కనిపించకపోయినా ఆరుగురు సైనికులను వెతికేందుకు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ లోని 24 జిల్లాల్లో 33 వేలమందికి పైగా ప్రజలు కూడా భారీ వరదలకు ప్రభావితమయ్యారు. ఈ సంవత్సరం వరదలలో మృతి చెందిన వారి సంఖ్యా 12కు చేరుకుంది.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్‌పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం