హైదరాబాద్‌లోనే రఫేల్ విడిభాగాల తయారీ

హైదరాబాద్‌లోనే రఫేల్ విడిభాగాల తయారీ

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు  సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్‌ కేంద్రంగా నిలవడం విశేషం. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం ఇకపై రఫేల్‌ యుద్ధవిమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్‌లోని టీఏఎస్‌ఎల్‌ లో తయారవుతాయి. రఫేల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాలు ఫ్రాన్స్‌ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్‌లను అందించనుంది. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెట్‌ సీఎండీ సుకరన్‌ సింగ్‌ తెలిపారు.  భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి, పురోగతిని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇప్పటికే టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీల విడి భాగాలు తయారు చేస్తోంది.

మరోవైపు ఈ ఒప్పందంపై డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ “భారత్‌లో మా ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది కీలక అడుగు. భారత రక్షణ రంగంలో మా సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుంది. అంతేకాదు, నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

మరోవైపు యుద్ధ విమానాల తయారీ దిశగా హైదరాబాద్‌ పరిశ్రమలు ముందడుగు వేశాయి. తేజస్‌ మార్క్‌-1ఏలో 5 భాగాలు ఉంటే అందులో మధ్య భాగాన్ని హైదరాబాద్‌ నగరంలోని వెమ్‌ టెక్నాలజీస్‌ డెవలప్ చేసింది. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్‌ మార్క్‌-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశారు. మొదటి ఉత్పత్తిని మే 30న హెచ్‌ఏఎల్‌కు అందజేశారు.