40 రైతులు హత్యాయత్నం కేసులతో అరెస్ట్

40 రైతులు హత్యాయత్నం కేసులతో అరెస్ట్
 
* తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
 
కాలుష్యం వెదజల్లే ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు దిగిన రైతులపై ప్రభుత్వం ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు తరలించింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏపీకి చెందిన ఇథనాల్‌ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో బుధవారం వందలాది మంది రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే. 
 
ఈ ఘటనపై గాయత్రి ఇథనాల్‌ కంపెనీ సీఈవో మంజునాథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం 40 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిపై యత్యాయత్నంతోపాటు మరో 17 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో 12 మందిని రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటనతో సంబంధం లేని నాగర్‌కర్నూల్‌ సబ్‌ జైలర్‌ నాగరాజుపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. 
 
పెద్ద ధన్వాడకు చెందిన సబ్‌ జైలర్‌ నాగరాజుకు ఇథనాల్‌ ఫ్యాక్టరీ సమీపంలో పొలం ఉన్నది. దీంతో ఆయనను కూడా రైతుగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన బుధవారం రాత్రి నుంచి పోలీసులు గ్రామాల్లోకి చొరబడి కనబడిన వాళ్లందరినీ చితకబాదుతూ డీసీఎంలు, మినీ ఆటోల్లో తరలించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. 
 
ముందుగా వారందరినీ రాజోళి పోలీస్‌స్టేషన్‌కు, ఆ తర్వాత మానవపాడు, గట్టు, అయిజ పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ రాత్రంతా చిత్రహింసలకు గురిచేసినట్టు అరెస్టయిన రైతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు వారం రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా, బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు తరలివెళ్లి పనులను అడ్డుకున్నారు.
 
ధన్వాడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై పోలీసులు దాడిచేసి గాయపరచడాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారంలో అసమర్థత కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతులపైకి పోలీసులను ఉసిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన రైతుపై పోలీసు అధికారి జులూం ప్రదర్శించిన మరుసటి రోజే ఈ విధంగా చేశారని మండిపడ్డారు.
ప్రజలు అధికారం ఇచ్చింది సమర్థవంతమైన పాలన అందించేందుకే తప్ప ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులతో దెబ్బలు తినేందుకు కాదని ఆయన హెచ్చరించారు.  పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో  అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు, కంపెనీ యాజమాన్యం కలిసి కూర్చుని సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లాలి తప్ప ఇలా రైతులపై లాఠీచార్జ్ చేయడం సరికాదని స్పష్టం చేశారు.