
మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెలరోజుల్లోపే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం మృతిచెందాడు. అతడు సుధాకర్‌గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు. అతడికి గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ రామరాజు, సోమన్న అనే మారు పేర్లు ఉన్నాయి.
ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లో మావోయిస్టు సీనియర్ లీడర్లు ఉన్నట్లు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు మొదలుపెట్టాయి.
ఈ క్రమంలో తెల్లవారుజామున దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ నేలకొరిగినట్టు సమాచారం. బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. అయితే సుధాకర్ మృతికి సంబంధించి ఎటువంటి ప్రకటను ఆయన జారీ చేయలేదు. బీజాపుర్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్దమొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరునెలల వ్యవధిలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు నాయకులను దళాలు ఎన్కౌంటర్ చేయడం గమనార్హం. ఇక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రెస్ ఇన్‌ఛార్జి బండి ప్రకాశ్, స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ లీడర్ పాపారావు కూడా అక్కడే ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్ రాజు ప్రకటన జారీ చేశారు.
ప్రకాశ్ మావోయిస్టుల నియామకాలు, ప్రచారం, దక్షిణ బస్తర్‌లో కార్యకలాపాలను పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతడిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఇక పాపారావు గెరిల్లా యుద్ధతంత్ర నిపుణుడు. ఉచ్చులు పన్నడంలో దిట్టగా పేరుంది. చాలా ఐఈడీ ఇతర దాడుల్లో అతడు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. అతడిపై రూ.20లక్షల రివార్డు ఉంది. వీరిద్దరికి సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. కేవలం మూడు వారాల వ్యవధిలో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. వారి సీనియర్ నాయకత్వాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి.. కేంద్ర కమిటీ సభ్యుడిని ఎన్కౌంటర్ చేశాయి.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ప్రభుత్వం ఎదుట మరికొంతమంది మావోలు లొంగిపోయారు. మరోవైపు ఇంకొంతమంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు