
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా గణన, కుల గణనను పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలనే డిమాండ్‌ను కాంగ్రెస్, ఇండియా కూటమితో పాటు పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేశాయి.
ఇటీవల, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు కుల గణన సర్వేను నిర్వహించాయి. అయితే, కర్ణాటకలో ఈ సర్వేపై వొక్కలిగ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వారు ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతీ 10 ఏళ్లకోసారి జరిగే జనగణన 2021 నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. వాస్తవానికి ఏప్రిల్ 2020లో ప్రారంభం కావాల్సిన జాతీయ జనాభా గణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అప్పుడు ఈ జనగణన సర్వే చేసి ఉంటే, తుది నివేదిక 2021 నాటికి వెలువడేది.
జాతీయ జనాభా లెక్కల ప్రక్రియలో కులాల గణనను భాగంగా చేయడం ఇదే తొలిసారి. కులగణన సమాచారం ఆధారంగా భారత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తీసుకోవచ్చని రాజకీయ పార్టీలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాదించాయి. ఆ మేరకు ప్రభుత్వ విధానపరమైన ప్రణాళికలను, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించొచ్చని సూచించాయి. ఈ నేపథ్యంలో జనగణనతో పాటే కులగణన నిర్వహణకు అంగీకారం తెలుపుతూ కేంద్ర సర్కారు నుంచి ప్రకటన వెలువడింది.
మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2010లో రూపొందించిన ఇళ్ల జాబితా ప్రకారం 2011 తొలినాళ్లలో జనగణనను నిర్వహించారు. 2011లో జరిగిన జనగణన ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లకుపైనే. జనాభా 17.7 శాతం మేర పెరిగిందని అప్పట్లో గుర్తించారు. 2021లోనూ జనగణన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020 ఏప్రిల్ నుంచి సమాచార సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని భావించారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ల నేపథ్యంలో ఆ ప్రక్రియను వాయిదా వేశారు.
2027లో జనగణన ప్రక్రియ పూర్తయ్యాక ఆ సమాచారం ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను కొత్త జనసంఖ్యకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తారు. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది. ప్రతి ఎంపీ లేదా ఎమ్మెల్యే దాదాపు ఒకే సంఖ్యలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ మార్పులు జరుగుతాయి.
రాజ్యాంగం ప్రకారం ప్రతీ జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ 1976 నుంచి ఈ ప్రక్రియను ఆపేశారు. దీనికి కారణం అప్పట్లో భారత ప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రోత్సహించాలని భావించింది. అధిక జనన రేటు కలిగిన రాష్ట్రాలు ఎక్కువగా ఉత్తరాదిలో ఉన్నాయి. జనాభాను నియంత్రణలో ఉంచిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పొందకుండా నిరోధించాలని నాటి కేంద్ర సర్కారు కోరుకుంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు