
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లకు ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటీసులు జారీచేసింది. ఢిల్లీలోని స్కూల్ బిల్డింగులు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏసీబీ ఇవాళ వారికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న సత్యేందర్, 9న సిసోడియా ఢిల్లీలోని ఏసీబీ బ్యూరో కార్యాలయానికి రావాలని నోటీసులలో ఆదేశించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆప్ ప్రభుత్వ హయాంలో సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) మంత్రిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం చేశారు. ఈ నిర్మాణ పనుల్లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పనులకు సంబంధించి మొత్తం 34 మందికి కాంట్రాక్టులు దక్కగా వారిలో చాలామందికి ఆప్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తేలింది.
కాంట్రాక్టర్‌లు నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయకపోగా భారీగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదులను కేవలం 30 సంవత్సరాలు మన్నిక ఉండేలా నిర్మించారని, కానీ వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌లు గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్‌లు, ఆర్కిటెక్ట్‌లను నియమించుకోవడంతో వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిపోయింది.
ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది. ఈ కేసులో మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌లో వారిపై కేసులు నమోదయ్యాయి.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు