
భారత్పై మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా ఉండే క్రమంలో పాకిస్థాన్‌లోకి చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణిస్తూ ఈ చర్యను అధునిక ప్రపంచం ఏ మాత్రం ఒప్పుకోదని జనరల్ చౌహన్ స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌పై భారత్ ప్రజల్లో మరింత అసహనం వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.
ఈ పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరి వారి కుటుంబసభ్యుల ఎదటే కాల్పులు జరిపారని గుర్తు చేశారు. దేశంలో జరిగిన ఉగ్రవాదుల చర్యల కారణంగా భారత్‌లో దాదాపు 20 వేల మందికిపైగా మరణించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మే 10వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు దాడులు ప్రారంభం అయ్యాయని, 48 గంటల్లో భారత్ను మోకరిల్లేలా చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ తొలుత ఈ దాడులను చేపట్టిందని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘించడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం వంటి రెచ్చగొట్టే చర్యల ద్వారా భారత్తో యుద్ధ తీవ్రతను పెంచడానికి కారణమైందని విమర్శించారు. నిజానికి భారత ఆర్మీ ఉద్దేశం మాత్రం పాక్, పీఓకేలో గల ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడమేనని, దాన్ని సాధించామని పేర్కొన్నారు. ఉగ్రమూకల ఏరివేత 48 గంటల పాటు కొనసాగుతాయని పాక్ భావించిందని, ఈ ఆపరేషన్ దాదాపు 8 గంటల్లో ముగిసిపోయిందని చెప్పారు.
“ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వైపు జరిగిన నష్టాల గురించి నన్ను అడుగుతున్నారు. అసలు ఆపరేషన్ సమయంలో నష్టాలు కావు. ఫలితాలే ముఖ్యం. నష్టాల గురించి మాట్లాడటం సరైనది కాదు. మీరు క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కు వెళ్లి ఇన్నింగ్స్ తేడాతో గెలిస్తే, ఎన్ని వికెట్లు, ఎన్ని బంతులు, ఎంత మంది ఆటగాళ్లు అనే ప్రశ్నే ఉండదు” అని తెలిపారు.
“మేము ఆపరేషన్ సమయంలో శత్రు దేశానికి చెందిన ఎన్ని విమానాలను, రాడార్లను నాశనం చేశామని తెలియజేస్తాం. పాక్ పై జరిపిన ఆపరేషన్లు ఎనిమిది గంటల్లో ముగిశాయి. వెంటనే పాక్ కాల్పుల విరమణకు పిలుపునివ్వాల్సి వచ్చింది” అని వివరించారు. పహల్గాం దాడి లాంటి ఉగ్రదాడులను భారత్ సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పడగ కింద భారత్ ఉండబోదని తేల్చిచెప్పారు.
న్యూక్లియర్ బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని సీడీఎస్ హెచ్చరించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే తన విధానంగా మార్చుకుందని విమర్శించారు. కాల్పుల విమరణను ముందుగా పాకిస్థానే కోరిందని, కానీ నీరు రక్తం కలిసి పారవని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తీరు మారాల్సిందేనని చెప్పారు.
“ప్రొఫెషనల్ మిలిటరీ దళాలు ఎదురుదెబ్బలు లేదా నష్టాల వల్ల ప్రభావితం కావు. పాకిస్థాన్ నుంచి ప్రాయోజిత ఉగ్రవాదం ఆగిపోవాలి. భారత్ ఉగ్రవాదం, అణు బ్లాక్ మెయిల్ నీడలో జీవించదు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సాయుధ దళాలు తమ స్థాయిని పెంచుకున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి కొన్ని వారాల ముందు పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ భారత్, హిందువులపై విషం కక్కారు” అని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు