కలకత్తా హైకోర్టులో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలికి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దేశంలో వాక్ స్వాతంత్య్రం ఉన్నదని, అయితే అది ఏ ఒక్కరి మత ప్రయోజనాలను దెబ్బతీయడాన్ని అనుమతించదని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను కోర్టు జూన్ 5కు వాయిదా వేసింది.
ఆరోజు కేసుకు డైరీని సబ్మిట్ చేయాలని కలకత్తా పోలీసులను ఆదేశించింది.
“మనకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల మనోభావాలను గాయపరచమని కాదు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. వివిధ భాషలు, కులాలు, మతాలు ఉన్నాయి. ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో వీడియో వచ్చినట్టు, ఒక వర్గం ప్రజల మనోభావాలను గాయపరిచినట్టు విన్నాం” అని జస్టిస్ పార్ధసారథి చటర్జీ పేర్కొన్నారు.
కాగా శర్మిష్ఠ పనోలి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఓ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఆపరేషన్ సింధూర్‌పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించకపోవడాన్ని ఆ వీడియోలో ప్రశ్నించింది. అయితే ఆ వీడియో ఓ మతాన్ని అవమానించేలా ఉందని విమర్శలు రావడంతో ఆమె డిలీట్ చేసింది. తన వీడియో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది.అయినా కలకత్తా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టులో హాజరుపర్చగా జూన్ 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పనోలి తరఫు న్యాయవాది కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కలకత్తా హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. పనోలీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

More Stories
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
కేజ్రీవాల్ కోసం ఛండీగఢ్లో మరో శీష్ మహల్
స్వామి దయానంద సరస్వతి దార్శనికుడు