
తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఎస్సి/ఎస్టీ విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ బి క్యాటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా), సి క్యాటగిరీ (ఎన్ఆర్ఐ కోటా) సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన పరిస్థితిపై బీజేపీ గిరిజన మోర్చా, దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. విద్యను వ్యాపారంగా మార్చిన ఈ ప్రైవేట్ కళాశాలలపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా. కళ్యాణ్ నాయక్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకిష్టారెడ్డిని కలిసారు. ఆయనకు
అందించిన వినతిపత్రంలో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఎస్సి/ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయకుండా సీట్లను డబ్బుకు అమ్ముకుంటున్న తీరును బహిర్గతం చేశారు.రూ.10 నుండి 15 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తూ, కనీస నిబంధనలను పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మలచి, పేద, తక్కువ వనరులున్న ఎస్సి/ఎస్టీ విద్యార్థులను అణగదొక్కే ఈ వ్యవస్థను తక్షణమే ఆపకపోతే, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ ఎస్టీ, ఎస్సి మోర్చాలు శ్రీకారం చుడతాయని నేతలు హెచ్చరించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి