అందాల పోటీలపై మంత్రి ప్రభాకర్ ఎద్దేవా!

అందాల పోటీలపై మంత్రి ప్రభాకర్ ఎద్దేవా!
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అందాల పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడేసివిగా ఉన్నా యి.  మిస్‌ వరల్డ్‌ పోటీలపై నిర్వహించిన మీడియా సమావేశంలో “మీ పాలనాకాలంలో మరోసారి అందాలు పోటీలు నిర్వహించే ఆలోచన ఉన్నదా?” అని ప్రశ్నించగా “అంతలేదు.. వాళ్లు రమన్నా రారు. అడిగినా రారు” అంటూ మంత్రి పరోక్షంగా ఎద్దేవా చేశారు.

74 ఏండ్లుగా ‘మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ అందాల పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. కానీ, ప్రపంచ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌ వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీలు అభాసుపాలయ్యాయి. రేవంత్‌ సర్కారు అతి జోక్యం, అవగాహనలేమితో అంతర్జాతీయ స్థాయి పోటీలు కాస్త గల్లీ పోటీల మాదిరిగా సాగాయి. తెలంగాణ సంస్కృతిని అవమానపరిచేలా వ్యవహరించారు. 

 
కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు పోటీదారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలొచ్చాయి. మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ హైదరాబాద్‌లో తనకు ఎదురైన వేధింపులపై కన్నీటిపర్యంతమైంది. తనను వేశ్యలా చూశారంటూ ఆవేదన చెందింది. పోటీలు నిర్వహిస్తే కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని సర్కారు చెప్పుకోగా కనీసం ఆ పోటీలను నిర్వహించడానికి స్పాన్సర్లు కూడా ముందుకు రాలేదు. 
 
దీంతో నిధులు సమకూర్చుకోవడానికి వివిధ రంగాల ప్రముఖులతో విందులు, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో కంటెస్టెంట్లను ఆకర్షణగా నిలబెట్టారు. సాధారణంగా అందాల పోటీలు ఎక్కడ జరిగినా ఆ పోటీలకు సంబంధించి మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌, ఏజెన్సీలు చూసుకుంటాయి. కేవలం భద్రతాపరంగా సంబంధిత రాష్ర్టాల ప్రభుత్వాలు అండగా నిలుస్తాయి. 
 
కానీ, తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా అందాల పోటీలను ప్రభుత్వమే నిర్వహించింది. సుమారు రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలున్నప్పటికీ, పోటీలు పూర్తయ్యే వరకూ హాజరైన పరిస్థితి గతంలో భారతదేశంలోని బెంగళూరు, ముంబై నగరాల్లో జరిగిన పోటీల్లోనూ కనిపించలేదు. 
 
కానీ, తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రం అందాల పోటీల కోసం పూర్తి సమయం కేటాయించారు. కంటెస్టెంట్లకు ఆహ్వానం నుంచి వీడ్కోలు వరకు జరిగిన ప్రతీ కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా నాలుగుసార్లు అందాల పోటీల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లా మ్యాగీకి చేదు అనుభవం ఎదురైన చౌమహల్లా ప్యాలెస్‌ విందులోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.