రష్యా ఇంటెలిజెన్స్‌ ఆఫీస్ పక్క నుండే ఉక్రెయిన్ దాడులు

రష్యా ఇంటెలిజెన్స్‌ ఆఫీస్ పక్క నుండే ఉక్రెయిన్ దాడులు
 * చెక్క షెడ్‌ల పైకప్పులోపల దాచిన పేలుడు పదార్ధాల డ్రోన్ లతో దాడి
 
ఉక్రెయిన్‌ నిర్వహించిన ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రష్యా నట్టింట ఉక్రెయిన్‌ గూఢచారులు కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకొని 41 బాంబర్‌ విమానాలను పేల్చేశారు. దీనిని సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎఫ్​ఎస్​బీ కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్‌ సెంటర్‌ను ఉక్రెయిన్‌ నిర్వహించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.
 

రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ భారీ డ్రోన్‌ దాడులకు అద్భుతమైన ఆపరేషన్‌గా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. ఈ దాడికి స్పైడర్‌ వెబ్‌గా పేరు పెట్టినట్లు వెల్లడించారు. మూడేళ్లకు పైబడిన యుద్ధంలో ‘మా అత్యంత సుదూర ఆపరేషన్’ ద్వారా ‘అద్భుతమైన’ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.  దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సైనిక దళాలకు, ఆపరేషన్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

 
ఈ దాడి ప్రణాళికకు 18 నెలల సమయం పట్టినట్లు చెప్పారు. మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించినట్లు వెల్లడించారు. “ఇప్పుడే మా స్పెషల్‌ ఫోర్స్‌ అధిపతి వాసిల్‌ మలియుక్‌ అద్భుతమైన ఆపరేషన్‌ గురించి వెల్లడించారు. శత్రు భూభాగంలోని సైనిక లక్ష్యాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ఉపయోగించే పరికరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం” అని తెలిపారు. 
 
“మా సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ దాడిలో రష్యా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. ఆ దేశానికి ఇలా జరగాల్సిందే. ఆపరేషన్ ప్రణాళిక కోసం ఏడాదిన్నర సమయం పట్టింది. ప్లాన్‌ చేసిన ప్రకారంగానే రష్యాపై ఈ ఆపరేషన్‌ను అమలు చేశాం. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని నేను ఖచ్చితంగా చెబుతా” అని పేర్కొన్నారు.“ఈ దాడిలో 117 డ్రోన్లను వినియోగించాం. వైమానిక స్థావరాల్లోని 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ధ్వంసం చేశాం. మా దాడిలో రష్యాకు భారీ నష్టం వాటిల్లింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆపరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం. మేం ఆపరేషన్ చేపట్టిన ఆఫీస్, రష్యన్ భూభాగంలోని ఎఫ్ఎస్‌బీ కార్యలయానికి పక్కనే ఉంది” అని వెల్లడించారు. 

“ఇక ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్‌కు ముందు రష్యా నుంచి తీసుకొచ్చాం. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఏడాదిన్నర శ్రమ ఫలించినందుకు సంతృప్తిగా ఉంది. మేం ఈ దాడులను కొనసాగిస్తాం” అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ చేపట్టడానికి ముందే తాము చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించి తమపై రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని తమకు నిఘా సమాచారం అందినట్లు జెలెన్ స్కీ తెలిపారు. 

రెండు రోజుల్లోనే దాదాపు 500 డ్రోన్లను రష్యా ప్రయోగించిదని పేర్కొన్నారు. వారు చేసే ప్రతి దాడికి డ్రోన్ల సంఖ్యను పెంచతుందని చెప్పారు.  కాగా, ఉక్రేనియన్ భద్రతా అధికారి ఒకరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన చిత్రాల ప్రకారం, ఆదివారం నాడు రష్యన్ వైమానిక స్థావరాలపై ఉన్న వ్యూహాత్మక బాంబర్ విమానాలపై ఉక్రేనియన్ రహస్య సేవలు దాడి చేయగలిగాయి. చెక్క షెడ్‌ల పైకప్పుల లోపల పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్‌లను దాచిపెట్టడం ద్వారా ఈ షెడ్‌లను దాడి చేయగలిగాయి.

వైమానిక స్థావరాల చుట్టుకొలతకు తీసుకెళ్లబడిన ట్రక్కులపై షెడ్‌లను లోడ్ చేశారు. రిమోట్‌గా యాక్టివేట్ చేయబడిన యంత్రాంగం ద్వారా షెడ్‌ల పైకప్పు ప్యానెల్‌లను ఎత్తివేశారు, దీని వలన డ్రోన్‌లు బయటకు వెళ్లి దాడిని ప్రారంభించాయని ఆ అధికారి తెలిపారు. ఈ దాడిలో రష్యా వ్యూహాత్మక బాంబర్ల దళాన్ని కోలుకోలేని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. రష్యాకు 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
 
ఈ దాడిలో మొత్తం రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లలో 34శాతం ధ్వంసమైనట్లు కీవ్‌ చెబుతోంది. ఈ దాడిని రెండో ప్రపంచ యుద్ధంలోని పెరల్‌ హార్బర్‌ దాడితో పశ్చిమదేశాల పత్రికలు పోలుస్తున్నాయి. రష్యా పెరల్‌ హార్బర్‌ ఘటనగా అక్కడి పత్రికలు అభివర్ణిస్తున్నాయి.
 
ఈ ఆపరేషన్‌లో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. వీటి ఉత్పత్తిని చాలా కాలం క్రితమే రష్యా ఆపేసింది. దీంతో ధ్వంసమైన విమానాలను భర్తీ చేసుకోవడం క్రెమ్లిన్‌కు దాదాపు అసాధ్యం. పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం మాస్కో వద్ద మొత్తం 120 వరకు టీయూ95లు, టీయూ22ఎంలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై బాంబింగ్‌లో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి.