
పాకిస్తాన్ కు సింధు జలాలను అడ్డుకొంటే తాము భారత్ కు బ్రహ్మపుత్ర జలాలను ఆపివేస్తామంటూ చైనా చేస్తున్న బెదిరింపులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కొట్టిప్రవేశారు. బ్రహ్మపుత్ర నదిపై ఊహాజనిత పరిస్థితిపై భయాన్ని రేకెత్తించడానికి ఇది నిరాధారమైన ప్రయత్నం అని పేర్కొంటూ “చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే ఏమవుతుంది?” అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
భారతదేశంలో నది పరిమాణం పెరుగుతుందని, పై నుండి వచ్చే నీటి కారణంగా కుంచించుకుపోదని పేర్కొంటూ, బ్రహ్మపుత్రపై చైనా నియంత్రణ గురించి భయాలను తొలగించడానికి వాస్తవ ఆధారిత విధానాన్ని అమలు చేయాలని శర్మ కోరారు. “భయంతో కాదు, వాస్తవాలు, జాతీయ స్పష్టతతో ఈ అపోహను కూల్చివేసుకుందాం” అని ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
వాస్తవంగా, బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా కేవలం 30–35% మాత్రమే దోహదపడుతుందని, ప్రధానంగా హిమనదీయ ద్రవీభవనం,పరిమిత టిబెటన్ వర్షపాతం ద్వారా అని శర్మ తెలిపారు. మిగిలిన 65–70% నీరు భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా తగ్గించే ఊహాజనిత దృశ్యం భారతదేశానికి కూడా ప్రయోజనం చేకూర్చవచ్చని శర్మ ఎద్దేవా చేశారు.
“చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినప్పటికీ (చైనా ఎప్పుడూ బెదిరించలేదు లేదా ఏ అధికారిక వేదికలోనూ సూచించలేదు), అది వాస్తవానికి భారతదేశానికి అస్సాంలో వార్షిక వరదలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది మందిని నిర్వాసితులను చేస్తుంది, జీవనోపాధిని నాశనం చేస్తుంది,” అని ఆయన చెప్పారు.
అందుకు ప్రధాన కారణాలను ప్రస్తావిస్తూ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ అంతటా కుండపోత వర్షపాతం సుబాన్సిరి, లోహిత్, కామెంగ్, మనస్, ధన్సిరి, జియా-భరాలి, కోపిలి వంటి ఉపనదులు ఖాసీ, గారో ,జైంటియా కొండల నుండి కృష్ణై, దిగారు , కుల్సి వంటి నదుల ద్వారా అదనపు నీటిప్రవాహం సాంకేతిక వివరాలను ఆయన అందించారు.
ఇండో-చైనా సరిహద్దు (ట్యూటింగ్) వద్ద నది ప్రవాహం దాదాపు 2,000–3,000 m³/s ఉండగా, వర్షాకాలంలో అస్సాం మైదానాల్లో ఇది 15,000–20,000 m³/s వరకు పెరుగుతుందని శర్మ తెలిపారు. “బ్రహ్మపుత్ర నది భారతదేశం ఎగువ ప్రవాహంపై ఆధారపడిన నది కాదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది” అని ఆయన తేల్చి చెప్పారు.
“సింధు జలాల ఒప్పందం ప్రకారం 74 సంవత్సరాల ప్రాధాన్యత గల నీటి ప్రాప్యతను దోపిడీ చేసిన పాకిస్తాన్ భారతదేశం తన సార్వభౌమ హక్కులను తిరిగి పొందడంతో ఇప్పుడు భయాందోళనలకు గురవుతోంది” అని ఆయన పేర్కొన్నారు. “బ్రహ్మపుత్ర నది ఒకే మూలం ద్వారా నియంత్రించబడదు.ఇది మన భౌగోళికం, మన రుతుపవనాలు, మన నాగరికత స్థితిస్థాపకత ద్వారా శక్తిని పొందుతుంది” అని స్పష్టం చేశారు.
కాగా, అంతకు ముందు భారత్‌లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ గవో సోమవారం బీజింగ్‌లో ప్రకటించారు. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై భారత్ వైఖరి పట్ల ఆయన ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ అస్సాం ముఖ్యమంత్రి ధీటుగా బదులిచ్చారు.
ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారు అని గ్రహించాలని పేర్కొంటూ చైనా మిత్రుడైన పాకిస్థాన్‌కు నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే భారత్‌లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదని విక్టర్ భారత్ నుహెచ్చరించారు. భారతదేశ జల భద్రతకు అత్యంత ముఖ్యమైనదైన బ్రహ్మపుత్ర నది నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై చేపట్టిన ప్రతీకార చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై విక్టర్ స్పందిస్తూ భారత్ నుంచి నదులు పాక్‌లోకి ఎలా ప్రవహిస్తాయో చైనా నుంచి కూడా నదులు భారత్‌లోకి ప్రవహిస్తాయని తెలిపారు.
సర్వ కాలాలలో తమకు అత్యంత ఆప్త మిత్రుడైన పాకిస్థాన్‌కు మద్దతుగా బ్రహ్మపుత్ర నదీ జలాలను భారత్‌పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుందని ఆయన చెప్పారు. ఇతరులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే అందుకు వచ్చే ప్రతిస్పందనలకు కూడా భారత్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని హితవు చెప్పారు. ఆ ప్రతిస్పందనలు భారత్‌లో పెను సవాళ్లకు దారి తీయగలవని ఆయన హెచ్చరించారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా