వరుసగా రెండో నెల రూ. 2 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ

వరుసగా రెండో నెల రూ. 2 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందనడానికి మరో స్పష్టమైన సంకేతం. వాస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మే 2025లో వరుసగా రెండో నెలలోనూ రూ. 2 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 16.4 శాతం వృద్ధిని సూచిస్తోంది.

ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు రూ. 2.37లక్షల కోట్లతో అల్ టైం రికార్డు నెలకొపంగా, మే నెలలో కూడా రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటడం ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరమైన పురోగతిని, ఆర్థిక వ్యవస్థ రికవరీని స్పష్టం చేస్తోంది. మే నెలలో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల ఆదాయం 13.7 శాతం పెరిగి సుమారు రూ. 1.50 లక్షల కోట్లకు చేరుకుంది. 

అదే సమయంలో, దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్టీ రాబడి 25.2 శాతం వృద్ధితో రూ. 51,266 కోట్లకు చేరింది. మే నెల వసూళ్ల విభజన చూస్తే, సెంట్రల్ జీఎస్టీ (సిజిఎస్టి) రూ. 35,434 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్ జీఎస్టీ) రూ. 43,902 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజిఎస్టి) దాదాపు రూ. 1.09 లక్షల కోట్లుగా ఉన్నాయి. అదనంగా, సెస్ వసూళ్లు రూ. 12,879 కోట్లకు చేరుకున్నాయి. 

గతేడాది మే 2024లో వసూళ్లు రూ. 1,72,739 కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో మొత్తం రీఫండ్‌లు 4 శాతం తగ్గి రూ. 27,210 కోట్లకు చేరుకున్నాయి. నికర జీఎస్టీ వసూళ్లు సుమారు రూ. 1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి, ఇది గతేడాదితో పోలిస్తే 20.4 శాతం వృద్ధిని సూచిస్తుంది. జీఎస్టీ వసూళ్లలో దేశవ్యాప్తంగా సానుకూల వృద్ధి కనిపించినప్పటికీ, రాష్ట్రాల వారీగా గణనీయమైన తేడాలు ఉన్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎం.ఎస్. మణి ప్రకారం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాలు 17 శాతం నుంచి 25 శాతం వరకు అధిక వృద్ధిని నమోదు చేశాయి. 

అయితే, ఇదే సమయంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని పెద్ద రాష్ట్రాల్లో వృద్ధి 6 శాతం వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలు 10 శాతం వరకు వృద్ధి కనబరిచాయి. రాష్ట్రాల మధ్య ఈ వృద్ధిలో వైవిధ్యం సెక్టోరల్ లేదా కాలానుగుణ కారకాల వల్ల కావొచ్చని, దీనికి లోతైన డేటా ఆధారిత విశ్లేషణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.