రక్షణ శాఖ కొనుగోళ్ల సమయ పరిమితిని గణనీయంగా తగ్గించింది. దాంతో సైనిక పరికరాల కొనుగోలులో చాలా సమయం ఆదా అవుతుందని రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. రక్షణ కొనుగోళ్లలో సమగ్ర సంస్కరణలు, రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకువచ్చినట్లు రక్షణ కార్యదర్శి తెలిపారు.
రాజధాని ఢిల్లీలో జరిగిన రక్షణ సమావేశంలో మాట్లాడుతూ సంస్కరణలతో రక్షణ కొనుగోలు ప్రక్రియలో 69 వారాలు ఆదా అవుతుందని చెప్పారు. ఇటీవల వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సీఐఐ బిజినెస్ సమ్మిట్లో రక్షణ ప్రాజెక్టుల్లో జాప్యం, సమయపాలన, వ్యవస్థాగత సమస్యలపై రక్షణ మంత్రి సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 32 ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి స్వావలంబన అవసరమని రక్షణ కార్యదర్శి పేర్కొన్నారు. గత దశాబ్దంలో రక్షణ రంగంలో ప్రారంభమైన స్వదేశీకరణ కారణంగా, 2015 సంవత్సరంలో భారతదేశం అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా ఉండగా, నేడు భారత్ టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
వందకుపైగా భారతీయ కంపెనీలు వందకుపైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. ఇందులో బ్రహ్మోస్ మిస్సైల్స్, రాకెట్ లాంచర్ పినాకా, సిమ్యులేటర్ ఆర్మర్డ్ వాహనాలు ఉన్నాయని చెప్పారు. గత సంవత్సరం రూ. 23,622 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం