ఉగ్రస్థావరాలపై దాడి తర్వాతే పాక్‌కు సమాచారం

ఉగ్రస్థావరాలపై దాడి తర్వాతే పాక్‌కు సమాచారం

ఆపరేషన్‌ సిందూర్‌ దాడులు గురించి పాకిస్థాన్‌కు ముందే సమాచారం ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడింది. ఉగ్ర స్థావరాలపై దాడులు పూర్తయ్యాకే పాకిస్థాన్‌కు సమాచారం అందించామని తెలిపింది. ఈ మేరకు విదేశాంగశాఖకు చెందిన కాన్సులేటీవ్‌ కమిటీ ఆఫ్‌ పార్లమెంట్‌ సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టతనిచ్చారు. 

“ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు పూర్తయ్యాకే పాకిస్థాన్‌కు చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో)కు సమాచారం అందించాం. అప్పటికే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలో కూడా ప్రకటన విడుదలైంది” అని తెలిపారు.  ఆపరేషన్ సిందూర్ గురించి ముందుగానే పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చినట్టు జైశంకర్ బహిరంగంగానే అంగీకరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల వరుస ఆరోపణలు గుప్పించారు.

ఇంతటి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఇండియాకు చెందిన ఎన్ని విమానాలను కోల్పాయామో చెప్పాలని డిమాండ్ చేశారు. జైశంకర్ మాట్లాడుతున్న ఒక వీడియోను కూడా రాహుల్ షేర్ చేశారు.  అయితే, ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. జైశంకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ఆపరేషన్‌కు ముందే పాక్‌కు సమాచారం ఇచ్చినట్టు జైశంకర్ ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది.

కాగా, ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం, ఆమెరికా మధ్యవర్తిత్వంపై ఎంపీలు జైశంకర్‌ను ప్రశ్నించగా, ఆపరేషన్ సులభతరం చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. యూఎస్‌‌తో మాట్లాడినప్పుడు డీజీఎంఓ స్థాయిలో మాత్రమే చర్చలు జరగాలని భారత్ చాలా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై కూడా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

ఒప్పందాన్ని పునఃప్రారంభించే ఆలోచన కానీ, సవరించే ఆలోచన కానీ ఇండియాకు ఉందా అని అడిగినప్పుడు, ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, ఇప్పటికిప్పుడు కేంద్రానికి దీనిపై ఎలాంటి పునరాలోచన లేదని చెప్పారు. ఎంపీల బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తున్నాయని, అందుకే దేశం మొత్తం ఒక్కతాటిపై నడవాలని జైశంకర్ అభ్యర్థించారు.

ఆపరేషన్‌ సిందూర్‌ పాక్‌ దళాల విశ్వసనీయత, నైతికతను దెబ్బతీసిందని జైశంకర్ చెప్పారు. ఉగ్రవాదంపై భారత వైఖరిని మూడు దేశాల తప్ప మిగిలిన దేశాలు విమర్శించలేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయని వెల్లడించారు.