`ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత డా. తమిళసై సౌందరాజన్ సారధ్యంలో చెన్నైలో సోమవారం జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తమిళనాడులో జమిలి ఎన్నికలపై దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్డీయే కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం తన బాధ్యత అని చెబుతూ గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశానని గుర్తు చేశారు.
భారత దేశంకు జమిలి ఎన్నికలు అవసరమని, ఆ విధంగా ఎన్నికలు జరిపే సామర్థ్యం దేశానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు డీఎంకే అగ్రనేత కరుణానిధి జమిలి ఎన్నికలు దేశానికీ అవసరం అని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మరి ఇప్పుడు డీఎంకే నేతలకు ఆ ఎన్నికలు ఏవిధంగా తప్పుగా అనిపిస్తున్నాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పునరాలోచన చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రాంతీయ పార్టీలకు, సమాఖ్య స్ఫూర్తికీ ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. ద్వంద్వ వైఖరితో తమిళ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తమిళనాడును వదిలి 3 దశాబ్దాలు గడచినా తనను ఈ గడ్డ వదలడం లేదని, తనపై ఈ తమిళ నేల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. తిరుక్కురళ్, మార్షల్ ఆర్ట్స్తో పాటు సినిమా ప్రభావం తనపై ఎక్కువగా ఉండటానికి చెన్నైలో నివసించడమే కారణమని తెలిపారు.
ఈ మధ్య కాలంలో వైఎస్సార్సీపీ లాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో గెలిస్తే అది తమ గొప్పే అని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని నిందిస్తున్నాయని పవన్ ధ్వజమెత్తారు. అలా సమయానుకూలంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. తమిళ యువత ఒకే దేశం- ఒకే ఎన్నికల విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలని కోరుతూ తరచు ఎన్నికలు జరగడం వల్ల అది మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హితవు పలికారు.

More Stories
కులం, సంపద, భాష ఆధారంగా ప్రజలను అంచనా వేయవద్దు
శ్రీరాముని ఆదర్శంగానే ఆపరేషన్ సిందూర్
చిచ్చు రేపిన సల్మాన్ ఖాన్ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’