డ్రోన్‌లు, క్షిపణులతో రష్యా భీకర దాడులు

డ్రోన్‌లు, క్షిపణులతో రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య ఒకవైపు యుద్ధ ఖైదీల మార్పిడి జరుగుతుంటే మరోవైపు యుద్ధం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య పరస్పర దాడులకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఆదివారం వందలాది మంది సైనికులు, పౌరులను విడిచిపెట్టిన రష్యా.. అంతకు కొన్ని గంటల ముందే ఉక్రెయిన్‌పై భీకర దాడులకు తెగబడింది. ఏకంగా 298 డ్రోన్‌లు, 69 క్షిపణులతో దాడికి పాల్పడింది.

రష్యా తాజా దాడుల్లో 12 మంది మృతిచెందారు. మూడేళ్ల యుద్ధంలో ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం ఇదే తొలిసారని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం ఇరుదేశాలు 390 మంది చొప్పున యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోగా.. శనివారం 307 మంది చొప్పున మార్పిడి చేసుకున్నాయి. 

తాజాగా ఆదివారం 303 మంది చొప్పున సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఈ ప్రకటన రాకముందు ఉక్రెయిన్‌లోని కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేసింది. ఒకేరోజు 69 క్షిపణులు, 298 డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిలో ఇరాన్‌ రూపొందించిన షాహెద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం. 

మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా అనేకమంది గాయాలపాలయ్యారు. ఉక్రెయిన్‌లోని 30 నగరాలు, గ్రామాలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. తాజా దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు. రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్పితే ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయలేమని పేర్కొన్నారు.