ఆపరేషన్ సిందూర్ తో భారత్ స్పష్టమైన సందేశం

ఆపరేషన్ సిందూర్ తో భారత్ స్పష్టమైన సందేశం
 
ఆపరేషన్ సిందూర్ తో ఉగ్ర చర్యలను సహించదనే స్పష్టమైన సందేశాన్ని భారత్ పంపిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు. ఉగ్రవాదంపై తమ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు, ఈ విషయంలో భారత్ దృఢ వైఖరిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు శశథరూర్ నాయకత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది.  ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను బృందం సందర్శించింది. అనంతంరం మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చినట్లు శశిథరూర్ అన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

“పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత బలగాలు కచ్చితమైన దాడులు చేసి, వాటిని నేలమట్టం చేశాయని శశిథరూర్ వివరించారు. ‘మేం ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే, పాకిస్థాన్ సైన్యం స్పందించి, ప్రతిదాడులకు దిగింది. వాటిని సమర్థంగా తిప్పికొట్టాం. ఈ ఆపరేషన్‌తో ఉగ్రచర్యలను భారత్ సహించదనే గట్టి సందేశం ఇచ్చింది. ఇది పహల్గాం దాడికి ప్రతిస్పందన మాత్రమే తప్ప పాక్‌తో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం కాదు. దాన్ని మేం కోరుకోవడం లేదు. దేశ ప్రజల రక్షణే మాకు ముఖ్యం” అని శశిథరూర్‌ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాదం గురించి విభిన్న వర్గాలతో చర్చించడమే తమ బృందం పర్యటన లక్ష్యమని శశిథరూర్ తెలిపారు. ఇక పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ, పహల్గాంలో మతం ఆధారంగా పర్యటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపారు. ఈ దాడితో భారత్‌లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది వారి ప్రయత్నమని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. 

లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)ఈ దారుణానికి పాల్పడిందని చెప్పారు. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ ఇప్పటికే ఐరాసను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం కోసం కాకుండా, ప్రతిపక్ష పార్టీ కోసమే పని చేస్తానని శశిథరూర్ తెలిపారు. ఈ దాడి తర్వాత పాక్‌పై తీసుకోవాల్సిన అంశాలను ఉద్దేశిస్తూ ఒక వ్యాసం రాసినట్లు చెప్పారు. భారత బలగాలు పాక్‌ను బలంగా, తెలివితో దెబ్బతీసిశాయని పేర్కొన్నారు.

శశిథరూర్ నేతృత్వంలోని బృందంలో సభ్యులు సర్ఫరాజ్ అహ్మద్(జేఎంఎం), గంటీ హరీశ్ మధుర్ బాలయోగి(టీడీపీ), శశాంక్ మణి త్రిపాఠి(బీజేపీ), భువనేశ్వర్ కలిత (బీజేపీ), మిలింద్ దేవరా (శివసేన), తేజస్వి సూర్య (బీజేపీ), అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సంధు ఉన్నారు. ఈ బృందం మళ్లీ జూన్ 3న అమెరికాకు తిరిగి వస్తుంది.