
అయితే ఈ చార్జిషీట్‌ను కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. పీఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా(ఏ-1) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా(ఏ-2) రాహు ల్ గాంధీ పేరును ఈడీ పేర్కొన్నది. వీరితోపాటు మరో ఐదుగురి పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది.
నేషనల్ హెరాల్డ్ నుంచి రూ.2,000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్టు తెలిపింది. యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో సీఎం, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు ఉన్నాయి.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో యంగ్ ఇండియన్ సంస్థకు వరుసగా రూ.6.90 కోట్లు, రూ.5.05 కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును ఆ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను పెండింగ్ బిల్లును చెల్లించేందుకు వినియోగించినట్టు ఈడీ పేర్కొన్నది. అయితే దర్యాప్తు సంస్థ చార్జిషీట్లో వీరెవరినీ నిందితులుగా పేర్కొనలేదు.
మరోవైపు చార్జిషీటులో పేరు రావడంపై రేవంత్ రెడ్డి నుంచి కాని, బన్సల్ నుంచి కాని ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని డెక్కన్ హెరాల్డ్ పేర్కొన్నది. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొన్నది. అహ్మద్ పటేల్ అభ్యర్థనను కాదనలేక యంగ్ ఇండియన్‌కి రూ.30 లక్షల విరాళాన్ని తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చానని, మరో రూ. 20 లక్షలు నగదుగా ఇచ్చానని అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ అనే కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు తెలిపింది.
అహ్మద్ పటేల్ తనకు ఏఐసీసీ కార్యాలయంలో పోస్టింగ్ ఇప్పిస్తానని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన అల్లుడికి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి యంగ్ ఇండియన్‌కు విరాళాలు తీసుకున్నారని రాజీవ్ గంభీర్ అనే నాయకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. అయితే తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గంభీర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో భాగంగా 2023 నవంబర్‌లో ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఏజేఎల్‌కు చెందిన రూ. 751.9 కోట్ల మేర విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు