హోంమంత్రిపై కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు

హోంమంత్రిపై కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు
 
* కర్ణాటక కాంగ్రెస్ లో నటి రన్యారావు అరెస్ట్ దుమారం
 
బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంస్థకు రన్యారావుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన విద్యా సంస్థపై సోదాలు కూడా చేపట్టారు.  ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వర్గపోరుతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలే పరమేశ్వరపై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు. వారే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారంటూ పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. 
 
“కాంగ్రెస్‌లోని ఓ వర్గం పరమేశ్వరపై ఈడీకి ఫిర్యాదు చేసింది. వారే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. నేను ఒకటి స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. పరమేశ్వర మంచి రాజకీయ నాయకుడు. ఆయన్ని మేము గౌరవిస్తాము. కానీ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు పంపే వ్యక్తులు ఉన్నారు. ఈ విషయాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా తెలుసు. నిఘా విభాగం ఆయన కిందే ఉంది. ఇప్పుడు ఆయన కూడా డ్రామా చేస్తున్నారు” అంటూ ఆరోపించారు.

“ఈ విషయంపై ఆయన్ని అడగండి. పరమేశ్వరపై చర్య తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఎవరు లేఖలు రాస్తున్నారో..?” అని ప్రహ్లాద్‌ జోషీ ఎద్దేవా చేశారు. రన్యారావుకు హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ గురువారం అంగీకరించారు. అయితే అది ఆయన వివాహ బహుమతిగా రన్యారావుకు అందజేసిన మొత్తమని వివరించారు.

“ఒక వివాహం జరిగింది ప్రజలకు బహుమతిగా మేము 10 వేలు, 5 లేదా 10 లక్షలు ఇస్తాం. ఆమె ఏం చేసినా అది తప్పే. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను కేవలం పరమేశ్వర విషయమే మాట్లాడుతున్నా. ఆమెకు ఆయన అందజేసినది బహుమతి మాత్రమే” అని శివకుమార్‌ మీడియాకు తెలిపారు.

పరమేశ్వర పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయనే కాదు కాంగ్రెస్‌ నేతలెవ్వరూ తప్పుడు పనులు చేయరని ఆయన సమర్థించారు. రన్యారావు స్మగ్లింగ్‌ కేసులో సంబంధాలు ఉండటమే కాక, ఆమెతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణతలో హోం మంత్రికి చెందిన విద్యా సంస్థలపై ఈడీ బుధవారం దాడులు నిర్వహించి, రన్యారావుతో నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది.