రూ 6,000 కోట్లు దారి మళ్లించిన యూకో బ్యాంక్ మాజీ సీఎండీ 

రూ 6,000 కోట్లు దారి మళ్లించిన యూకో బ్యాంక్ మాజీ సీఎండీ 

కోల్‌క‌తా జోన‌ల్ ఆఫీసుకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ మే 16వ తేదీన యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోద్ కుమార్ గోయ‌ల్‌ను అరెస్టు చేయగా,  అత‌ను అక్ర‌మ రీతిలో బ్యాంకుకు చెందిన సుమారు 6210.72 కోట్ల డ‌బ్బును దారి మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టిన ఈడీ అనేక విష‌యాల‌ను వెల్ల‌డించింది. 

కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ లిమిటెడ్ సంస్థ‌కు భారీగా క్రెడిట్ సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు ఈడీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఆ అక్ర‌మ రుణాల మొత్తం ఆరు వేల కోట్లు ఉంటుంద‌ని ఈడీ అంచ‌నా వేసింది. అరెస్టు చేసిన సుబోద్ కుమార్ గోయ‌ల్‌ను మ‌నీల్యాండ‌రింగ్ కోర్టు ముందు మే 17వ తేదీన హాజ‌రుప‌రిచారు. మే 21వ తేదీన వ‌ర‌కు ఆయ‌న్ను ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గించారు. 

ఢిల్లీలోని త‌న నివాసం నుంచి గోయ‌ల్‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల‌లోనే గోయ‌ల్‌తో సంబంధం ఉన్న ప్రాప‌ర్టీల‌పై ఈడీ దాడులు చేసింది. సీఎస్పీఎల్ సంస్థ‌కు క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చిన అంశంపై సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. బ్యాంకు రుణాల‌ను అక్ర‌మ రీతిలో దారిమ‌ళ్లించిన గోయ‌ల్‌కు న‌గ‌దు, స్థిరాస్తులు, ల‌గ్జ‌జీ వ‌స్తువులు, హోట‌ల్ బుకింగ్‌లు ఫేవ‌ర్‌గా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 

షెల్ కంపెనీలు, డ‌మ్మీ వ్య‌క్తులు ద్వారా ఆ లావాదేవీలు జ‌రిగాయి. షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసిన ప్రాప‌ర్టీ వివ‌రాల‌ను కూడా గుర్తించిన‌ట్లు ఈడీ త‌న స్టేట్మెంట్‌లో పేర్కొన్న‌ది. ల‌బ్ది పొందిన ప్రాప‌ర్టీల‌ను సుబోధ్ కుమార్ కంట్రోల్ చేస్తున్న‌ట్లు తేలింది. సీఎస్పీఎల్‌తో ఆ ప్రాప‌ర్టీల‌కు లింకు ఉన్న‌ట్లు గుర్తించారు.